మోడీ బాధను కళ్లారా చూశాను 

 మోడీ బాధను కళ్లారా చూశాను 

రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలనే దానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎగ్జాంపుల్ గా నిలిచారన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. విచారణ సంస్థలు ఆయనను ప్రశ్నించినా.. ఎక్కడా ధర్నాలు, ఆందోళనలు చేయలేదన్నారు. గుజరాత్ అల్లర్ల ఇష్యూలో మోడీపై ఆరోపణలు చేసిన వారు క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. ఆనాటి గుజరాత్ ప్రభుత్వం చాలా అలర్ట్ గా  ఉందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని.. ANI వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అమిత్ షా. ఈ ఆరోపణలపై 19 ఏండ్లపాటు మోదీ మౌనంగా ఎంతో బాధపడ్డారని, అది తాను దగ్గర నుంచి కళ్లారా చూశానని షా చెప్పుకొచ్చారు. ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి మాత్రమే ఏమీ మాట్లాడకుండా నిలబడగలరని అన్నారు.

కొన్ని ఎన్జీవోలు, మీడియా సంస్థలు కలిసి మోదీపై బురదజల్లాయ్యాని అమిత్ షా ఆరోపించారు. కానీ, వెలుగుతున్న సూర్యుడిలా మోదీ ఆరోపణల నుంచి బయటకు వచ్చారన్నారు. మోదీ ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని చెప్పారు. గుజరాత్‌ అల్లర్లపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. అల్లర్లు ముందస్తు ప్రణాళికతో జరగలేదని కోర్టు తెలిపిందని ప్రస్తావించారు. అరవై మందిని రైల్లో సజీవంగా తగలబెడితే విపక్షాలు మాట్లాడలేదని... మైనారిటీ ఓటు బ్యాంక్‌ కోసం పాకులాడాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్‌ విచారణను తాము ప్రభావితం చేయలేదని... సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై కూడా అమిత్ షా స్పందించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ మైలేజ్ కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. సిట్ ముందు హాజరైనప్పుడు మోడీ డ్రామా చేయలేదన్నారు. తనకు మద్దతుగా రండి అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలవలేదన్నారు. విచారణకు సహకరించారు. మనీలాండరింగ్ కేసులో రాహుల్ ను ఈడీ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నిరసనలు ఎందుకు చేస్తుందని అమిత్ షా ప్రశ్నించారు.