
ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచులో టీమిండియా అద్భుతం చేసింది. దాదాపు గెలుపు కష్టమనుకున్న ఐదో టెస్టులో అద్భుతంగా పోరాడి విజయం సాధించింది ఇండియా. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచులో అతిథ్య ఇంగ్లాండ్‌ను 6 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 2–2తో సమం చేసింది టీమిండియా. ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
ఐదో టెస్ట్ సెకండ్ ఇన్సింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కీలకమైన ఓవల్ టెస్టులో ఫైఫర్ సాధించి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. బాల్ బాల్‌కు నిప్పులు చెరుగుతూ అతిథ్య జట్టు బ్యాటర్లను వణికించాడు. సిరాజ్ విసిరిసిన బంతులు మెరుపు వేగంతో రాకెట్ల మాదిరిగా దూసుకుపోతుంటే ఆ బాల్ ఆడాలంటే ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. పేసర్లకు స్వర్గధామమైన ఇంగ్లాండ్ పిచ్‌లపై అదే పేస్ తో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
చివరిదైన ఐదో రోజు విజయానికి ఇంగ్లాండ్‌కు 35 రన్స్ అవసరం కాగా.. ఇండియా నాలుగు వికెట్లు తీయాలి. ఈ దశలో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం దక్కింది. తొలి ఓవర్లోనే ఓవర్టన్ రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. ఈ సమయంలో సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న జేమి స్మిత్ (2), ఓవర్టన్ (9)ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత నేనేమి తక్కువ కాదంటూ జోష్ టంగ్‌ను ప్రసిద్ కృష్ణ బౌల్డ్ చేసి 9వ వికెట్ పడగొట్టాడు. టీమిండియా విజయం లాంఛనం అనుకున్న సమయంలో చివర్లో అట్కిన్సన్ సిక్సర్‌తో టీమిండియాను భయపెట్టాడు.
చేతి గాయం కారణంగా వోక్స్ బ్యాటింగ్ చేయలేని పరిస్థితి ఉండటంతో అట్కిన్సన్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకున్నాడు. అట్కిన్సన్ క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించడంతో ఇండియా డగౌట్లో ఎక్కడో కొంచెం భయం మొదలైంది. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న సిరాజ్.. అద్భుతమైన బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేసి టీమిండియాకు సంచలన విజయాన్ని అందించాడు. ఇండియాకు గెలుపు కష్టమనుకున్న ఐదో టెస్టులో అద్భుత బౌలింగ్‌తో విజయం అందించడంతో సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ALSO READ : IND vs ENG 2025: ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుతం..
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 247 పరుగులకే పరిమితమైంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ (118) సెంచరీతో ఇండియా 396 పరుగులు చేసింది. టంగ్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 374 పరుగుల ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది.