
- కాంగ్రెస్ నాంపల్లి సెగ్మెంట్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్
మెహిదీపట్నం, వెలుగు: మతోన్మాద మజ్లిస్ కు ఈసారి ఓటమి తప్పదని నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం మజ్లిస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ లు మజ్లిస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలూ ఒకటేనని విమర్శించారు. నాంపల్లిలో 90 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వాటిలో 40 వేల ఓట్లు తొలగించారని, ఇంకా 50 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు.
ప్రతిసారి మజ్లిస్ బోగస్ ఓట్లతోనే గెలుస్తుందని, ఈసారి అలాంటి పప్పులేమి ఉడకవని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల ద్వారా బోగస్ ఓట్లు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈనెల 6న నామినేషన్ దాఖలు చేస్తానని, మతం ఆధారంగా చేసే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. సెక్యులర్ నాంపల్లిగా మార్చి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఆయన మిమిక్రీ కళాకారుడు అశోక్ కుమార్ రచించి, స్వరపరిచిన ఫిరోజ్ ఖాన్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. ఫిరోజ్ ఖాన్ సతీమణి లైలా ఖాన్, నేతలు బుక్క రమేశ్, జి. వెంకటేశ్, మాదాసు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.