మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి పోటీ పడ్డ ఇద్దరు అభ్యర్థులు

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో  సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి పోటీ పడ్డ ఇద్దరు అభ్యర్థులు
  •     కౌంటింగ్‌‌‌‌ రోజున ఇద్దరికీ గెలిచినట్లు ధ్రువపత్రాలు ఇచ్చిన ఆఫీసర్లు
  •     గూడూరు మండలం దామరవంచలో గందరగోళం

గూడూరు, వెలుగు: గ్రామపాలకవర్గాల ప్రమాణస్వీకారం సందర్భంగా మహబూబాబాద్‌‌‌‌ జిల్లా గూడురు మండలం దామరవంచలో గందరగోళం ఏర్పడింది. ‘నేనే సర్పంచ్‌‌‌‌ను అంటే.. కాదు, నేనే సర్పంచ్‌‌‌‌ను’ అంటూ ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగారు. గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరుగగా.. బీఆర్ఎస్‌‌‌‌ మద్దతుతో పోటీ చేసిన నునావత్‌‌‌‌ స్వాతి 3 ఓట్లతో విజయం సాధించింది. దీంతో ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. 

కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి సనుప సుజాత రీ కౌంటింగ్‌‌‌‌ కోరగా.. కౌంటింగ్‌‌‌‌ తర్వాత ఒక్క ఓటుతో సుజాత గెలిచినట్లు ప్రకటించి ఆమెకు కూడా ధ్రువీకరణ పత్రం అందజేశారు. సోమవారం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. పోలీసులు, ఆఫీసర్లు జోక్యం చేసుకొని.. సనప సుజాతతో సర్పంచ్‌‌‌‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఈ విషయంపై గూడూరు ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ... దామరవంచలో ఆర్‌‌‌‌వోగా పనిచేసిన వై.విజయలలిత... సుజాతకు మాత్రమే ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, స్వాతికి ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. ఈ విషయంపై గూడురు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.