
జూన్ 20వ తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి జట్టులో చోటు దక్కలేదు. ఫామ్ లేమి, ఫిటినెస్ వంటి కారణాలతో బీసీసీఐ షమీని పక్కన పెట్టింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున భారీ అంచనాలతో బరిలోకి దిగిన షమీ పూర్తిగా నిరాశపర్చాడు. షమీ విఫలం కావడంతో మధ్యలోనే అతడి జట్టు నుంచి తప్పించింది ఎస్ఆర్హెచ్.
ఐపీఎల్లో అట్టర్ ప్లాఫ్ షో కూడా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీకి చోటు దక్కకపోవడానికి ఒక కారణం. ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో దొరికిన సమయాన్ని షమీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి బ్యాక్ యార్డ్ క్రికెట్ ఆడాడు. టీమిండియా ఐకానిక్ బ్లూ జెర్సీ ధరించి బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు.
స్వతహాగా బౌలరైన షమీ బ్యాటింగ్‌లో వెరైటీ షాట్లు ఆడి ఆలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్ స్టా గ్రామ్‌లో షేర్ చేశాడు షమీ. ‘‘ఈ రోజు కుటుంబంతో కలిసి మైదానంలో సరదాగా గడిపాను’’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోలో షమీ టీమిండియా బ్లూ జెర్సీ కలర్ దుస్తులు ధరించడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాక్‌యార్డ్ క్రికెట్ కూడా టీమిండియా జెర్సీ కలర్ డ్రెస్ ధరించి ఆడటం క్రికెట్ పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా క్రికెట్ ఆటగాళ్ల జీవితంలో భాగంగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. మరికొందరు కమ్ బ్యాక్ షమీ సార్.. మిమ్మల్ని మళ్లీ గ్రౌండ్లో చూడాలని కామెంట్లు పెట్టారు. టెస్టు క్రికెట్ లోకి మీరు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని మరికొందరు కోరుకుతున్నారు.