వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన వెటరన్ పేసర్, 2023 వన్డే వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా..? నేషనల్ టీమ్‌లోకి తిరిగి రావాలన్న అతని ఆశలు అడియాసలేనా..? టీ20 జట్టు లెక్కల్లో ఎప్పుడో స్థానం కోల్పోయిన షమీ, ఇప్పుడు టెస్టు, వన్డే ఫార్మాట్‌లో కూడా రీఎంట్రీ చేయడం అసాధ్యమేనా..? అంటే, ప్రస్తుత పరిణామాలు, బీసీసీఐ వర్గాల ఆలోచనా విధానం చూస్తుంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో చీలమండ గాయానికి గురైన షమీ, ఆ తర్వాత చాలాకాలం ఆటకు దూరమయ్యాడు.
సర్జరీ అనంతరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరగా ఈ మార్చిలో చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 35 ఏండ్ల షమీ ఇప్పుడు తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతూ ఇప్పటికే 93 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి చెమటోడ్చాడు. కానీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ మాత్రం ఈ వెటరన్ పేసర్‌ను పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది.
అసలు వివాదం అక్కడే
తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ వాదనను ఖండిస్తున్నారు. ‘సెలెక్టర్లు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సపోర్ట్ స్టాఫ్ షమీతో నిరంతరం టచ్‌లోనే ఉన్నారు. అతని రికవరీని పర్యవేక్షించారు. అంతే కాదు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు షమీని సెలెక్టర్లు పరిగణించారు.
ఆ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి ఇవ్వాల్సి ఉన్నందున, షమీ అనుభవం జట్టుకు అవసరమని భావించారు’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, గాయం నుంచి కోలుకుని నేరుగా టెస్ట్ ఆడే మ్యాచ్ ఫిట్‌నెస్ అతనికి ఉందో లేదో పరీక్షించాలనుకున్నారు. ఇందుకోసం ఓ సీనియర్ సెలెక్టర్ స్వయంగా షమీకి పలుమార్లు మెసేజ్‌లు పంపి, ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కాంటర్‌బరీ లేదా నార్తాంప్టన్‌లో జరిగే ఇండియా-–ఎ మ్యాచ్ ఆడాలని కోరినట్టు సమాచారం.
తద్వారా తను సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా లేదా అని తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ, షమీ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. తన వర్క్‌లోడ్ పెంచుకోవాల్సి ఉన్నందున ఆ మ్యాచ్ ఆడలేనని చెప్పినట్టు సమాచారం. ‘తనతో ఎవరూ మాట్లాడలేదన్న షమీ వాదనలో నిజం లేదు. అతని మెడికల్ రిపోర్టులను స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షించింది’ అని సదరు బోర్డు అధికారి తేల్చిచెప్పారు. ఈ ఘటనే షమీ రీఎంట్రీకి అతిపెద్ద అడ్డంకిగా మారిందని తెలుస్తోంది.
ఇక కష్టమే..
రంజీల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన షమీ ప్రస్తుతం రైల్వేస్‌తో జరుగుతున్న పోరుకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 16 నుంచి అసోంతో జరిగే మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఆడి డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే, 197 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల అనుభవం ఉన్న ఈ వెటరన్ పేసర్‌ను తిరిగి ఇండియా జెర్సీలో చూడాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. లేదంటే, టీమిండియాలో మరో గొప్ప పేసర్ కథకు తెరపడినట్లే.
130 కి. మీ మించని స్పీడ్.. నాలుగు ఓవర్ల స్పెల్స్‌తో సరి..
గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టెస్టులు, టీ20లకు షమీ అవసరం జట్టుకు లేకుండా పోయింది. అతను ఆటకు దూరమైన సమయంలో ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ వంటి యువ పేసర్లు టెస్టు టీమ్‌లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. దీంతో టెస్టు జట్టులో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో షమీకి మిగిలిన ఏకైక ఆప్షన్ వన్డే ఫార్మాట్. కానీ, తదుపరి వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది.
అప్పటికి షమీ వయసు 37 ఏండ్లు దాటుతుంది. పదేళ్ల కిందటే మోకాలికి మేజర్ సర్జరీ అయిన చరిత్ర, ఫిట్‌నెస్ సమస్యలున్న షమీని మూడేండ్ల భవిష్యత్తు కోసం సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారా అనేది సందేహమే. అదే సమయంలో రంజీ ట్రోఫీలో 93 ఓవర్లు వేయడం, కొన్ని వికెట్లు పడగొట్టడం పైకి బాగానే కనిపిస్తున్నా.. లోతుగా పరిశీలిస్తే అతని బౌలింగ్ తీరు సెలెక్టర్లకు నమ్మకం కలిగించడం లేదు.
ఎందుకంటే తన కెరీర్ పీక్‌లో 135–-140 కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన షమీ, ఇప్పుడు రంజీల్లో సగటున 130 కి.మీ వేగాన్ని కూడా దాటడం లేదు. పైగా, అతను లాంగ్ స్పెల్స్ వేయడం లేదు. కేవలం నాలుగు ఓవర్ల చిన్న స్పెల్స్ వేస్తూ, ప్రతీ స్పెల్ మధ్య ఎక్కువ విరామం తీసుకుంటున్నాడు. దాంతో టెస్ట్ మ్యాచ్‌లో రోజంతా ఫీల్డింగ్ చేస్తూ, లాంగ్ స్పెల్స్ వేస్తే అతని పాత గాయాలు తిరగబెట్టే ప్రమాదం ఉందన్న వాదన కూడా ఉంది.
