MI vs RCB: బుమ్రా బౌలింగ్‌కు సిరాజ్ ఫిదా.. శిరస్సు వంచి నమస్కారం

MI vs RCB: బుమ్రా బౌలింగ్‌కు సిరాజ్ ఫిదా.. శిరస్సు వంచి నమస్కారం

వాంఖడే వేదికగా గురువారం (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై మంచినీళ్లు తగినంత ఈజీగా కొట్టేశారు. గెలుపోటముల సంగతులు పక్కన పెడితే ఈ మ్యాచ్ లో కొన్ని ఎమోషన్స్ అభిమానులను కట్టి పడేశాయి. హార్దిక్ ను టీజ్ చేయొద్దంటూ ఫ్యాన్స్ కు కోహ్లీ సైగ చేయడం హైలెట్ గా నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం బుమ్రా, సిరాజ్ ల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ ఎంతో ముచ్చటగా అనిపించింది. 

మ్యాచ్ తరువాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో సిరాజ్ బుమ్రా దగ్గరకు వెళ్లి తలవంచి నమస్కరించాడు. ఇంతలో బుమ్రా అతన్ని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా 5 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.  విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, లోమరోర్,సౌరవ్ చౌహన్, విజయ్ కుమార్ వైశుక్ ల వికెట్లు తీసి ఐపీఎల్ లో రెండోసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అంతేకాదు 10 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 
  
మరోవైపు సిరాజ్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లో 37 పరుగులు ఇచ్చాడు. ఆశలు పెట్టుకున్న సిరాజ్ ప్రతి మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇవ్వడం ఆర్సీబీ జట్టు పెద్ద మైనస్ గా మారింది. జూన్ నెలలో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో సిరాజ్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. సహచర పేసర్ బుమ్రా రాణిస్తున్నా.. సిరాజ్ తేలిపోతున్నాడు. మరి రానున్న మ్యాచ్ లోనైనా ఈ టీమిండియా ప్రధాన సీమర్ గాడిలో పెడతాడేమో చూడాలి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌‌‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. ఛేజింగ్ లో ముంబై 15.3 ఓవర్లలో 199/3 స్కోరు చేసి గెలిచింది.