తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటది: మోహన్ బాబు

తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటది: మోహన్ బాబు

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా మే 4ని   డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌‌డీఏ)  నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  ఈ ఈవెంట్‌‌లో పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులను సత్కరించారు.  ఈ సందర్భంగా  మోహన్ బాబు మాట్లాడుతూ  ‘తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్ బాబుగా మార్చారు.  హిందీ దర్శకుడు బాల్కి గారికి నా చేతుల మీదుగా అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది.  దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి గారు. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకులంతా కలిసి ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా  తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్  అసోసియేషన్‌‌కి  పదిహేను  లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తున్నాను.  చిత్ర సీమ ఉన్నంత వరకు దాసరి గారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది’ అని అన్నారు.  సీనియర్ నటీనటులు జయప్రద,  జయసుధ, బాబు మోహన్,  దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, ఆర్ నారాయణ మూర్తి,  వీర శంకర్, ఎన్ శంకర్, రామ్ జగదీష్,  నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ,  వై  రవిశంకర్,  చదలవాడ శ్రీనివాసరావు,  వల్లభనేని అనిల్,  పీజీ విందా తదితరులు పాల్గొన్నారు.