Kerala MeToo: దయచేసి మలయాళ సినీ పరిశ్రమను నాశనం చేయకండి: మోహన్‌ లాల్‌

Kerala MeToo: దయచేసి మలయాళ సినీ పరిశ్రమను నాశనం చేయకండి: మోహన్‌ లాల్‌

జస్టిస్‌ కె హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీపరిశ్రమను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (AMMA)ను లక్ష్యంగా చేసుకోవద్దని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal) విజ్ఞప్తి చేశారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలను వివరించే జస్టిస్ హేమ కమిటీ నివేదికను విడుదల చేసినందుకు నటుడు మోహన్‌లాల్ ఇవాళ (ఆగస్ట్ 31న) కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ మేరకు జస్టిస్‌ కె హేమ కమిటీ నివేదికను మోహన్‌లాల్ స్వాగతించారు.

అయితే..మలయాళ సినీపరిశ్రమను నమ్ముకుని చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఈ సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. దయచేసి మలయాళ పరిశ్రమను నాశనం చేయవద్దు అని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపైన సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది. తప్పు చేసిన దోషులకు చట్టం నుండి శిక్ష తప్పదని మోహన్‌లాల్ స్పష్టం చేశారు. 

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 17 మంది సభ్యులు ఉన్న పాలక కమిటీ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ‘అమ్మ (AMMA)’ సంఘం మంగళవారం (ఆగస్ట్ 27న) ఓ ప్రకటనలో వెల్లడించింది.

ALSO READ | Poonam Kaur: ఏపీలో జరుగుతున్న ఘటనలపై..పూనమ్ కౌర్ సంచలన లేఖ

ఇప్పటివరకు ‘అమ్మ’ సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షుడిగా ఉండగా..నటులు జగదీశ్‌, జయన్‌ చేర్తలా, బాబురాజ్‌, కళాభవన్‌ షాజన్‌, సూరజ్‌ వెంజారమూడు, టొవినో థామస్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 

జస్టిస్ హేమ కమిటీ:

2017 లో మాలీవుడ్ నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పపడిన విషయం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఘటనకు కారకుడు మలయాళ అగ్రహీరో దిలీప్‌ కీలక నిందితుడిగా తేలింది. మాలీవుడ్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో నివేదిక ఇవ్వాలని 2019 లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ కే హేమ(రిటైర్డ్) నేతృత్వం వహించగా, మాజీ బ్యూరోక్రాట్ కెబి వల్సలకుమారి, నటి శారత ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. మాలీవుడ్ లో మహిళలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ వెల్లడించింది.