మోకిల ప్లాట్ల వేలంతో.. 105 కోట్ల ఆమ్దానీ

మోకిల ప్లాట్ల వేలంతో.. 105 కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు: మోకిలలో నాలుగో రోజు 60 ప్లాట్లను వేలం వేశారు. దీని ద్వారా రూ. 105.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ సోమవారం వెల్లడించింది. 60 ప్లాట్లు వేలానికి పెట్టగా అన్నీ అమ్ముడుపోయాయని చెప్పింది. హయ్యస్ట్ ధర గజం రూ. 66 వేలు, కనిష్టంగా రూ.49వేలు, యావరేజ్​గా రూ.56,537 పలికిందని తెలిపింది. ఇప్పటివరకు 5 రోజుల పాటు వేలం నిర్వహించగా.. చివరగా మంగళవారంతో ముగియనుందని వెల్లడించింది. తొలి 3 రోజుల్లో లేఅవుట్​లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70వేల నుంచి రూ.1,05, 000ల వరకు పలికింది. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండోరోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడోరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. 

మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అందుబాటులో ఉండటంతో ప్లాట్ల కొనుగోలుకు చాలామంది పోటీపడుతున్నారని హెచ్​ఎండీఏ తెలిపింది. దేశంలో ముంబై తర్వాత పెద్ద అపార్ట్ మెంట్ల నిర్మాణంలో హైదరాబాద్ రెండో ప్లేస్​లో ఉందని హెచ్ఎండీఏ కమిషనర్, మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. 50 నుంచి 59 ఫ్లోర్లతో నిర్మిస్తున్న పెద్ద అపార్ట్ మెంట్లు హైదరాబాద్​లో ప్రస్తుతం 10 ఉన్నాయని, ఇందులో 5 కోకాపేట నియోపోలిస్ సమీపంలో ఉన్నాయని పేర్కొన్నారు.