- పది రోజులుగా మళ్లీ ముఖం చాటేసిన వానలు
- 38 డిగ్రీలకుపైగా నమోదవుతున్న టెంపరేచర్లు
- సాధారణం కన్నా 3 -5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: వానకాలంలోనూ ఎండ మంట, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38 డిగ్రీలదాకా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అదే సమయంలో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంటున్నది. గాలిలో తేమ వంద శాతం వరకు నమోదవుతుండడంతో.. కాసేపు ఫ్యాన్ తిరగకపోయినా ఊపిరాడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాయంత్రం 6 గంటల దాకా ఉక్కపోత తీవ్రంగా ఉంటున్నది. జులై చివరి వారంలో వచ్చిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఓ వారం పాటు వర్షాలు బాగానే పడినా.. ఈ నెలలో పది రోజులుగా మళ్లీ వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు వానలు తప్ప.. చెప్పుకోదగిన స్థాయిలో పెద్ద వర్షాలేవీ పడలేదు. దీంతో వర్షపాతలోటు కూడా క్రమంగా పెరుగుతున్నది. వర్షపాత లోటు ఎక్కువున్న జిల్లాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం సగటు వర్షపాత లోటు 12 శాతంగా నమోదైంది.
15 జిల్లాల్లో లోటు వర్షపాతం..
రాష్ట్రంలో వర్షపాతం మళ్లీలోటులోకి వెళ్తున్నది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 482.4 మిల్లీమీటర్లుకాగా.. కేవలం 423.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్నటిదాకా వర్షపాత లోటు 4 శాతం వద్ద ఉండేది.. ఇప్పుడది 12 శాతానికి పెరిగింది. రాష్ట్ర సగటు సాధారణ కేటగిరీలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో -46 శాతం లోటుంది. వరంగల్‌లో 44 శాతం, జనగామలో -43 శాతం, ఖమ్మంలో -34 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 34 శాతం, మహబూబాబాద్‌లో -32 శాతం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో -31 శాతం, సూర్యాపేటలో 30 శాతం చొప్పున వర్షపాతలోటున్నది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నల్గొండ, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ 20 శాతానికి పైగా లోటు నమోదైంది. కేవలం కామారెడ్డి జిల్లాలో మాత్రమే సాధారణం కన్నా 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
వాయుగుండంపైనే ఆశలు
ఇటు టెంపరేచర్లు సాధారణం కన్నా 3 నుంచి ఐదు డిగ్రీల దాకా ఎక్కువగా నమోదవుతున్నాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో అత్యధికంగా 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో 37.8 డిగ్రీలు, ఖమ్మం అర్బన్‌లో 37.4, మహబూబాబాద్‌లో 36.6, నారాయణపేట, పెద్దపల్లిలలో 35.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్ సిటీలోనూ 35.1 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో.. జార్ఖండ్ పరిసరాల్లో ఏర్పడిన వాయుగుండంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. రెండు వారాల కిందట వచ్చినట్టుగానే మంచి వర్షాల స్పెల్ వచ్చే ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జార్ఖండ్, వారణాసి, డెహ్రాడూన్, ఫిరోజ్‌పూర్, బెంగాల్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండంతో బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు మంగళవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా యాచారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కాంకోల్లో 3.9 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కేశంపేటలో 3.7, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 3.1, జగిత్యాల జిల్లా పొలాసలో 2.9, మంచిర్యాల జిల్లా తాండూరులో 2.7, నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 2.6, వనపర్తి జిల్లా గోపాలపేటలో 2.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా హయత్‌నగర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది. చంపాపేటలో 2.5, వనస్థలిపురంలో 2.4 సెంటీమీటర్ల వర్షం పడింది.
టెంపరేచర్లు ఇలా..
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు 38.2 డిగ్రీలు
నల్గొండ జిల్లా దామరచర్ల 37.8 డిగ్రీలు
ఖమ్మం అర్బన్ 37.4 డిగ్రీలు
మహబూబాబాద్ 36.6 డిగ్రీలు
హైదరాబాద్ సిటీ 35.1 డిగ్రీలు
ఈ నెలలో వర్షపాతం ఇలా..
సగటు వర్షపాతం 482.4 మి.మి.
నమోదైన వర్షపాతం 423.8 మి.మి.
వర్షపాత లోటు 12 శాతం
