ఈసారి తెలంగాణకు గడ్డుకాలమే.. 14 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే చాన్స్ తక్కువ

ఈసారి తెలంగాణకు గడ్డుకాలమే.. 14 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే చాన్స్ తక్కువ

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది తెలంగాణతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా వర్షాకాలం చాలా ఆలస్యమైందని తెలిపారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘రాష్ట్రీయ్ వికాస్ గ్రామీణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 14 రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. ఇందులో 111 జిల్లాల్లో తీవ్ర గడ్డుకాలం ఎదురుకానుందని హెచ్చరించారు. వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం.. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, యపీ, రాజస్తాన్, కర్నాటక, బీహార్, జార్ఖండ్, పంజాబ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఉన్నాయన్నారు. అందువల్ల జల సంరక్షణలో భాగంగా చిన్న చిన్న కుంటలు, చెరువులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. 

కేంద్ర పర్యావరణ మంత్రితో చర్చిద్దాం


తెలంగాణలో ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన స్కీం అమలుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్రంలో పలు రోడ్లకు పర్యావరణ అనుమతులు అవసరం ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.