వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ చట్టాన్ని వాపస్ తీసుకోండి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క వినతి

వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ చట్టాన్ని వాపస్ తీసుకోండి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క వినతి

న్యూఢిల్లీ, వెలుగు: వీబీజీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. ఈ స్కీం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని పూసాలో ‘రాష్ట్రీయ్ గ్రామీణ్ వికాస్ సమ్మేళన్’పేరుతో అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.

 అనంతరం వీబీజీ రామ్ జీ చట్టం అమలుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రాన్ని అందజేసి, మీడియాతో మాట్లాడారు. వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ చట్టానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, సూచనలను సమావేశంలో వివరించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీఎస్)ను హక్కు ఆధారిత కార్యక్రమంగానే కొనసాగించాలని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతిపాదిత వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కొత్త చట్టం గ్రామీణ పేదల పని హక్కును బలహీనపర్చడంతో పాటు గ్రామ పంచాయతీల అధికారాలను తగ్గించి, రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తోందని తెలిపారు. 

కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తర్వాతే చట్టం అమలు..

కొత్త చట్టంలో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని, వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేటినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై అన్ని అంశాలను పరిశీలించిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, గ్రామీణ పేదల సంక్షేమం, ఆర్థిక పరిస్థితులను పరిశీలించాకే మంత్రివర్గం తుది నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. 

కొత్త చట్టంలో చేరాలా, వద్దా అనే అంశంపై జులై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని వెల్లడించారు. మరోవైపు, పీఎం ఆవాస్ యోజన(పీఎంఏవై) స్కీం కింద తెలంగాణ కు ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీతక్క కోరారు. రెండేండ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి కేంద్రానికి పంపిందని, అయినా ఇండ్ల మంజూరు జరగలేదన్నారు. 

అలాగే, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వై)కింద.. తెలంగాణలో మంజూరైన అనేక రహదారి పనులు అటవీ, వన్యప్రాణి అనుమతుల సమస్యలతో నిలిచిపోయాయని తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లమల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, బోర్లు, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల నిర్మాణం కూడా అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోతోందని వివరించారు. రోడ్లకు కేంద్రం మంజూరు ఇచ్చినప్పుడే అటవీ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కల్పించే విధానం తేవాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.