ఇబ్రహీంపట్నం, వెలుగు: ఎకో టౌన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు గ్రామాల ప్రజలు సోమవారం ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిర్యాలలో డంపింగ్ యార్డును ఎకో టౌన్ ప్రాజెక్టు పేరుతో జీవో 21 ద్వారా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. బండరావిర్యాల, చిన్నరావిర్యాల, బాచారం తదితర గ్రామాల ప్రజలు, పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్ వద్దకు చేరుకుని ముట్టడించారు.
గేటు వద్ద ఉన్న పోలీసులను తోసుకుంటూ లోనికి ప్రవేశించి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బండరావిర్యాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పలు గ్రామాలు ఇప్పటికే మూసీ నది కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, మళ్లీ వాటిని కాలుష్య కేంద్రాలుగా మార్చొద్దన్నారు.
డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, బండరావిర్యాల సర్పంచ్ విజయ్ కుమార్, పిల్లాయిపల్లి, చిన్నరావిర్యాల, దేశ్‌ముఖి, పెద్దగూడెం, కవాడిపల్లి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
