సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిభూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఐదుగురు అరెస్ట్

సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిభూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఐదుగురు అరెస్ట్

వేములవాడ రూరల్, వెలుగు: గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఐదుగురిపై కేసు నమోదైంది. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామపంచాయతీ పరిధిలో తాళ్లపెళ్లి రాములుకు పాత ఇంటితో పాటు సుమారు 16 గుంటల స్థలం ఉంది. రాములుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు మల్లేశం, ప్రవీణ్ ఉండగా, ఆమె మరణానంతరం చంద్రవ్వను రెండో పెండ్లి చేసుకున్నాడు.

చంద్రవ్వకు లత, సాగర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం రాములు మృతిచెందాడు. ఆ స్థలాన్ని కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించగా, భూమి రాములు పేరుపై పట్టాలో లేదని తెలిసింది. దీంతో గ్రామపంచాయతీ సెక్రటరీ పేరుతో ధ్రువీకరణ పత్రం అవసరమని డాక్యుమెంట్ రైటర్లు సూచించారు. కుటుంబ సభ్యులు అప్పటి గ్రామపంచాయతీ సెక్రటరీ రమను సంప్రదించగా, ఆమె అలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేనని, కేవలం ‘నో డ్యూ’ సర్టిఫికెట్ మాత్రమే జారీ చేసింది.

తర్వాత తమకు పరిచయమైన విష్ణువర్ధన్ ద్వారా శేఖర్ సహాయంతో సమస్య పరిష్కరిద్దామని భావించిన సాగర్, లత, చంద్రవ్వలు వేములవాడలోని అభినయ్ డాక్యుమెంట్ కార్యాలయంలో డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. ముందుగానే సృష్టించిన నకిలీ గ్రామపంచాయతీ సెక్రటరీ ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించి 2026 ఏప్రిల్ 15న 969 గజాల స్థలాన్ని సాగర్ పేరుపై గిఫ్ట్ డీడ్‌‌‌‌గా రిజిస్ట్రేషన్ చేశారు.

అనంతరం 2026 ఏప్రిల్ 22న మిగిలిన 968 గజాల స్థలాన్ని అదే పత్రంతో లత పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంపై మాజీ సెక్రటరీ రమ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తాళ్లపల్లి సాగర్, తాళ్లపల్లి లత, తాళ్లపల్లి చంద్రవ్వ, గుడిసె విష్ణువర్ధన్, మంద అభినయ్‌‌‌‌లను వేములవాడ భవానీనగర్‌‌‌‌లోని డాక్యుమెంట్ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌‌‌‌కు తరలించారు.