- ఇప్పటికే 100 లాడ్జీలు, మాల్స్ కు నోటీసులు
- డిటెక్టర్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు
- లేకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలోని షాపింగ్ మాల్స్, హోటళ్లు, లాడ్జీలు, పీజీ హాస్టళ్లలో మహిళల భద్రతకు భంగం కలిగిస్తున్న రహస్య (హిడెన్) కెమెరాల ముప్పును అరికట్టడానికి సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. గతేడాది గచ్చిబౌలిలోని ఒక ఉమెన్స్ పీజీ హాస్టల్ వాష్ రూమ్‌లో గీజర్ వెనుక... ఈ ఏడాది ఫిబ్రవరిలో అమీర్‌పేట్‌లోని ఒక పెద్ద బట్టల షోరూమ్ ట్రయల్ రూమ్ హుక్కులో సీక్రెట్ కెమెరాలు దొరకడం కలకలం రేపింది.
ఈ తరహా దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలోని వందకు పైగా ప్రముఖ షాపింగ్ మాల్స్, లాడ్జీల నిర్వాహకులకు పోలీసుల ఆదేశాలతో నోటీసులు జారీ చేశారు. ప్రతి మాల్, హోటల్ యాజమాన్యం తమ సొంత ఖర్చులతో రహస్య కెమెరాలను కనిపెట్టే ‘యాంటీ స్పై డిటెక్టర్’ పరికరాలను కొనాలని స్పష్టం చేశారు. రూల్స్ ఉల్లంఘిస్తే మాల్స్‌ను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
కొత్త నిబంధనలివే..
పోలీసులు జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి సంస్థ తప్పనిసరిగా ఒక 'కస్టమర్ సేఫ్టీ ఇన్‌చార్జ్'ను నియమించుకోవాలి. ఈ ఇన్‌చార్జ్ ఆధ్వర్యంలో ప్రతి వారం యాంటీ స్పై డిటెక్టర్ పరికరాలను ఉపయోగించి ట్రయల్ రూమ్‌లు, వాష్ రూమ్‌లు, టాయిలెట్లు, లాడ్జీల్లోని బెడ్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక రికార్డు రూపంలో భద్రపరచాలి. హోటళ్లు, మాల్స్ యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే హౌస్ కీపింగ్, ఇతర సిబ్బంది బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా పరిశీలించుకోవాలని పోలీసులు సూచించారు.
సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందిపై నిరంతరం నిఘా ఉంచాలని, అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, రంధ్రాలు (హోల్స్) లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ తనిఖీల్లో ఏదైనా సీక్రెట్ కెమెరా వంటి అనుమానాస్పద వస్తువు కనిపిస్తే, దాన్ని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
ఇక నిర్భయంగా...
ఈ సరికొత్త సాంకేతిక పరికరాల ఏర్పాటు వల్ల మహిళలు ఇకపై ఎలాంటి భయాందోళనలు లేకుండా నిర్భయంగా షాపింగ్ మాల్స్, హోటళ్లను ఉపయోగించుకునే సురక్షిత వాతావరణం ఏర్పడుతుంది. సాధారణ కంటితో గుర్తించడానికి వీల్లేని మైక్రో కెమెరాలను సైతం ఈ 'యాంటీ స్పై డిటెక్టర్లు' ఇన్ఫ్రారెడ్ కిరణాల సహాయంతో ఇట్టే పసిగట్టేస్తాయి. దీనివల్ల మహిళల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా, నేరం జరగడానికి ముందే దాన్ని అడ్డుకునే అవకాశం లభిస్తుంది.
నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికతో నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, లోపలి సిబ్బంది తప్పుడు పనులు చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పోలీసులు ఈ ప్రాంతాల్లో సడన్ రైడ్స్ నిర్వహిస్తారని, నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
