సాగులో నల్గొండ టాప్‌

సాగులో నల్గొండ టాప్‌

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 63.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ సీజన్​లో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని టార్గెట్‌ పెట్టుకోగా.. ఇందులో 44.50 శాతం పంటలు సాగైయ్యాయి.  ఈసారి పత్తి, కంది సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేసింది. దీంతో సాగైన పంటల్లో ఎక్కువగా  పత్తే వేశారు. కాటన్‌ సాగు టార్గెట్‌ 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.61 లక్షల ఎకరాల్లో అంటే 61శాతం సాగు నమోదైంది.  కంది 15 లక్షల ఎకరాలు సాగు చేయాలని టార్గెట్‌ పెట్టుకోగా  ఇప్పటివరకు 3.95 లక్షల ఎకరాల్లో వేసినట్లు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. సోయాబీన్‌ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.39 లక్షల ఎకరాల్లో వేశారు. వరి పొలాల సాగు టార్గెట్‌ 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 6.48 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు.  మక్కలు 3.23లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సాగులో నల్గొండ టాప్‌..
రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో ఇప్పటికే  ఏకంగా 104 శాతం సాగు జరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే ఎక్కువ పంటలు సాగైంది మాత్రం నల్గొండ జిల్లాలోనే కావడం గమనార్హం. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 6.77 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. దీంతో రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే ఇప్పటివరకు అత్యధికంగా సాగు జరిగి టాప్‌లో నిలిచినట్లు తేలింది. నల్లగొండ జిల్లాలో పత్తి ఏకంగా 6.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తరువాత 5.48లక్షల ఎకరాల్లో సంగారెడ్డి రైతులు రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత 5.47లక్షల  ఎకరాలతో ఆదిలాబాద్ మూడో స్థానంలో ఉంది.  అత్యంత తక్కువగా మేడ్చల్‌ జిల్లాల్లో కేవలం 9శాతం మాత్రమే పంటలు సాగైనట్లు తెలిపింది. మేడ్చల్‌లో కేవలం 2,338 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో అదనపు వర్షపాతం నమోదైంది.