Health tips: వానాకాలంలో చల్లగాలితో చిక్కులు.. ఇలా చేస్తే సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచిసేఫ్!

Health tips: వానాకాలంలో చల్లగాలితో చిక్కులు.. ఇలా చేస్తే సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచిసేఫ్!

చలికాలంలో టెంపరేచర్లు నెమ్మదిగా మారుతూ ఉంటాయి. కానీ, వానాకాలంలో మాత్రం మబ్బులు ఉన్నంతసేపు గాలి చల్లగా ఉంటుంది. మబ్బులు తేలిపోయాక వేడి వాతావరణం ఉంటుంది. వాతావరణంలో వెంటవెంటనే వచ్చే మార్పులకు తగినట్లుగా శరీరం అడ్జెస్ట్ కాలేదు. ఇలాంటప్పుడు కొన్ని జబ్బులు వస్తాయి. అలర్ట్ ఉంటే ఈ సీజనల్ ప్రాబ్లమ్స్ ని తేలిగ్గా ఫేస్ చేయొచ్చు అంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ చిలువేరు.

'చల్లగాలి వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. చల్లగాలి పీల్చితే ముక్కు మొదలు శ్వాస కోశాల్లోని రక్త నాళాల వరకు సంకోచిస్తాయి. అప్పుడు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ముక్కు దిబ్బడ మొదలవుతుంది. చల్ల గాలికి ముక్కులోని రక్తనాళాలు సంకోచించడంతో సైనసైటిస్, రైనైటిస్ (ముక్కులో వాపు), ఎడినైటిస్ (ఎడినాయిడ్ గ్లాండ్స్ వాపు) వస్తాయి. చల్లని గాలి ఎక్కువసేపు పీల్చడం వల్ల గొంతు బొంగురుపోతుంది. గొంతులో (టాన్సిల్స్) వాపు, నొప్పి వస్తుంది. ఎప్పుడైతే రక్త నాళాలు సంకోచిస్తాయో అప్పుడు శ్వాస వ్యవస్థలోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు లంగ్స్ లో రక్తనాళాలు సంకోచిస్తే ఎక్కువగా ఇబ్బంది పడతారు.

ఎండ పెరిగితే వెంటనే వేడి పెరుగుతుంది. ఇలా వెంటవెంటనే మార్పులు జరగడం వల్ల లంగ్స్ లో కఫం పేరుకుంటుంది. ముక్కు నుంచి నీరుకారుతుంది. గొంతులో (కఫం రావడం వల్ల) ఇరిటేషన్ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ (బ్రాంకైటిస్) ఉంటుంది.

ఆకలి ఎక్కువ

చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు రక్తనాళాలు సంకోచిస్తాయి. శరీరం లోపల ఉండే అవయవాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఎక్కువగా పని చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. అవసరానికి మించి తింటే ఫుడ్ జీర్ణం కాదు. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి చేరుతుంది. అక్కడ డైజెస్టివ్ ఎంజైమ్ లు ఉండవు. ఈ సీజన్లో లో ఫుడ్ సరిగా జీర్ణం కాదు కాబట్టే వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతాయి. ఫుడ్ సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కదుపులో అసిడిటీ పెరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్లు లోని అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ -డాక్టర్ చిలువేరు రవీందర్ సూచించారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

  • బాడీ బాగా సెన్సిటివ్ అనుకుంటే చల్లగాలికి ఎక్స్పోజ్ కావద్దు.
  • మబ్బులు పట్టినప్పుడు బయట తిరగకూడదు.
  • ముఖానికి మాస్క్ కట్టుకోవాలి. 
  • ప్రతి రోజూ రెండు మూడుసార్లు ఆవిరి పట్టాలి. 
  • గొంతు నొప్పి ఉంటే తప్పకుండా గోరు వెచ్చని నీళ్లే తాగాలి.