
ఇయ్యాల మరిన్ని జిల్లాలకు విస్తరణ
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజూ వానలు
మరో రెండ్రోజులు వర్షాలు పడే చాన్స్
అంచనా వేసిన దానికంటే ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. ఆదివారం మరికొన్ని జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణతో పాటు కర్నాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోకి రుతుపవనాలు ప్రవేశించాయి.
హైదరాబాద్, వెలుగు: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి వచ్చాయి. అంచనా వేసిన దానికంటే ముందే రాష్ట్రాన్ని తాకాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. ఆదివారం మరికొన్ని జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నెల 10 నుంచి12 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణతో పాటు కర్నాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. పోయినేడాది అంచనా వేసిన దాని కంటే మూడ్రోజులు ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు.. ఈసారి ముందుగానే వచ్చాయని పేర్కొంది.
జుక్కల్‌లో 12 సెం.మీ. వర్షపాతం
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు వానలు పడ్డాయి. శనివారం అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుండటంతో వానలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 12 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో పోచంపల్లిలో 9, కామారెడ్డిలోని పిట్లంలో 8, నిజామాబాద్‌లోని భీంగల్, సంగారెడ్డిలోని నారాయణఖేడ్, కామారెడ్డిలోని నిజాంసాగర్‌లలో 7, కొమురం భీంలోని కాగజ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరిలో 6, కరీంనగర్‌లోని జమ్మికుంటలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.