పంట నష్టం నమోదుకు ఏఈఓలను సంప్రదించండి

పంట నష్టం నమోదుకు ఏఈఓలను సంప్రదించండి
  • మొంథా బాధిత రైతులకు రైతు స్వరాజ్య వేదిక సూచన
  • 33%కంటే ఎక్కువ పంట దెబ్బతింటే పరిహారం వస్తుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాను బాధిత రైతులు తమ పంట నష్టం నమోదు కోసం వెంటనే ఏఈఓ(అగ్రికల్చర్ ఎక్స్‌‌‌‌టెన్షన్ ఆఫీసర్)లను సంప్రదించాలని రైతు స్వరాజ్య వేదిక సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 

అయితే, పంటనష్టం జరిగినా తమ పేర్లు ప్రభుత్వ జాబితాలో నమోదు కాలేదని కొందరు రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం రైతు స్వరాజ్య వేదిక సూచనల ఆధారంగా చర్యలు చేపట్టింది. రైతుల ఫిర్యాదులను స్వీకరించేందుకు గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో పంట నష్టం జాబితాలను ప్రదర్శించాలని ఆదేశించింది. అంతేగాక, పంట నష్టం నమోదు కాని రైతుల పంట పొలాలను ఏఈఓలు పునఃసమీక్ష చేయాలని తెలిపింది. లోపాలు సరిదిద్ది అర్హులందరికీ పరిహారం అందేలా చేయాలని స్పష్టం చేసింది. 

రైతులకు వేదిక సూచనలివే..

రైతులు తమ గ్రామ పంచాయితిలోని పంట నష్టం జాబితాలను పరిశీలించి, తమ పేరు లేకపోయినా లేదా తెలిసిన రైతుల పేరు నమోదు కాలేకపోయినా వెంటనే ఏఈఓ వద్ద ఫిర్యాదు చేయాలి. 33 శాతం కంటే ఎక్కువ నష్టం అంటే ఎకరాకు సాధారణంగా 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పంట 6.5 క్వింటాళ్లు లేదా అంతకంటే తక్కువకు పడిపోతే తీవ్ర నష్టంగా పరిగణిస్తారు. అలాంటి రైతులు తప్పక తమ పేరు నమోదు చేయించుకోవాలి. 

పంచాయితీ కార్యాలయంలో జాబితాలు లేకపోతే ఏఈఓను సంప్రదించి పంట అంచనాను పునఃసమీక్ష చేయాలని కోరాలి. తండాలు,  దూర ప్రాంతాల్లోని రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మొక్కజొన్న, చిరుధాన్యాలు వంటి నష్టపోయిన పంటలను కూడా ఏఈఓల దృష్టికి తీసుకెళ్లాలి. సర్వే సమయంలో పత్తి, వరి పంటలు కోలుకుంటాయని అధికారులు భావించి తీవ్ర నష్టంగా నమోదు చేయకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పంట కోలుకోకపోతే ఏఈఓలు తప్పక దాన్ని నమోదు చేయాలని వేదిక సూచించింది.