
ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్ 7 వ తేదీన రెండోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనపడుతుంది. అందువలన సూతకాలం వర్తిస్తుంది. సూతకాలం ఎప్పుడు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. .!
ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7 వ తేది రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం అర్థరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది.గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది.భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఫిజి మరియు అంటార్కిటికాలో కూడా కనిపిస్తుంది.
శాస్త్రాల ప్రకారం.. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7 వ తేది మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటినుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు.
సూతక కాలంలో ఏమి చేయకూడదు?
చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో మత పరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి. కాని మంత్రబలం ఉన్న వారు అనుష్ఠానం చేసుకోవాలి.
గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు .. వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని, పదునైన పనిముట్లతో ఎలాంటి పనులు చేయకూడదు. కనీసం కూరగాయలు కూడా కట్ చేయకూడదు. ఆహారాన్ని వండకూడదు.. తినకూడదని పండితులు సూచిస్తున్నారు.
పితృ పక్షం ప్రారంభం : చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. పితృ పక్షం కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమయ్యే ముందు పూర్ణిమ శ్రాద్ధం మరియు పితృ కర్మలను ఆచరించాలి
చంద్ర గ్రహణం ఎందుకు సంభవిస్తుంది: ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు... చంద్రుల మధ్యకు భూమి వచ్చినప్పుడు, సూర్యుని కాంతి చంద్రుడిని చేరుకోదు. అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి .. చంద్రుడు ఎరుపు .. నలుపు రంగులో కనిపిస్తాడు. ఇలాంటి పరిణామం సంభవించినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.