
న్యూఢిల్లీ: టెక్నాలజీ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్లు ఒకటికంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడం అనైతికమని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పష్టం చేశారు. ఇది మోసం తప్ప మరేమీ కాదని ట్వీట్ చేశారు. తమ ఎంప్లాయీస్ వేరే ఉద్యోగాలు చేయడానికి అనుమతించడాన్ని మూన్‌లైటింగ్ అని పిలుస్తున్నారు. ఇటీవల స్విగ్గీ తన రైడర్లకు ఇలాంటి సదుపాయాన్ని కల్పించింది. కరోనా తరువాత చాలా మంది ఇండ్ల నుంచే పనిచేస్తుండటంతో స్విగ్గీ వంటివి మూన్‌లైటింగ్ పద్ధతికి అనుమతి ఇస్తున్నాయి.
అయితే రిషబ్ వాదనను స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీశ్ మెనన్ తోసిపుచ్చారు. ఇక నుంచి చాలా కంపెనీలు ఇదే పద్ధతికి మారతాయని అన్నారు. ఎంప్లాయ్మెంట్ సెర్చ్ వెబ్సైట్ ‘ఇండీడ్ ఇండియా’ హెడ్ శశికుమార్ కూడా ఆయన మాటలను సమర్థించారు. కొన్ని దేశాల్లో ఇది వరకు కూడా ఇట్లాంటి పద్ధతులు ఉండేవని చెప్పారు.
కొన్ని ఉద్యోగాలతో వచ్చే జీతాలతో అవసరాలు తీరవు కాబట్టి వేరే పనులు చేయడం తప్పదని అన్నారు. ‘‘ ఇక నుంచి స్విగ్గీ ఉద్యోగులు అదనపు ఆదాయం- కోసం ఇతర ప్రాజెక్ట్‌లను తీసుకోవచ్చు. ఇందుకు ఇంటర్నల్ అప్రూవల్స్ అవసరం. ఉద్యోగులు కొన్ని షరతులు పాటిస్తేనే రెండవ ఉద్యోగం/పని చేయడానికి అనుమతి ఇస్తారు.
ఆఫీస్ సమయం ముగిశాక లేదా వారాంతాల్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ప్రస్తుత జాబ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ప్రొడక్టివిటీ దెబ్బతినని పద్ధతిలో ఇతర వర్క్ చేసుకోవచ్చు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ల సమయంలో చాలా మంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారని, అదనపు ఆదాయ వనరులను అందించే పనులను మొదలుపెట్టారు.
రిషద్ ప్రేమ్‌జీ అందుకే ఈ విధానాన్ని తెచ్చాం” అని స్విగ్గీ తెలిపింది. "మా ఉద్యోగులు ఒక ఎన్జీఓలో వలంటీర్‌గా పనిచేయవచ్చు. డ్యాన్స్ ట్రైనర్ లేదా సోషల్ మీడియా కోసం కంటెంటర్ వంటి పనులు చేసుకోవచ్చు. అటువంటి ప్రాజెక్ట్‌లలో పనిచేయడం వల్ల వాళ్ల కెరీర్‌కు, కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది” అని పేర్కొంది. స్విగ్గీ జాబ్‌పై ఎఫెక్ట్ చూపే లేదా ఎక్కువ ప్రమాదకర ప్రాజెక్ట్‌లలో పనిచేయాలంటే ముందస్తు ఆమోదం తీసుకోవడం తప్పనిసరి.
స్విగ్గీ సబ్సిడరీలు, అనుబంధ సంస్థలు, అసోసియేట్ గ్రూప్ కంపెనీలతో సహా బండిల్ టెక్నాలజీస్ ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది.బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్విగ్గీ యాప్‌ని నడుపుతోంది. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి అయినా పర్మనెంట్ విధానంలో పనిచేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు ఇటీవల స్విగ్గీ ప్రకటించింది.