ఎథికల్ హ్యాకర్లకు యమ క్రేజ్.. సిటీలో 50వేల మంది

ఎథికల్ హ్యాకర్లకు యమ క్రేజ్.. సిటీలో 50వేల మంది

హైదరాబాద్: హ్యాకర్ అంటే బడా వ్యాపారుల నుంచి సామాన్యుల దాకా అందరికీ భయమే. చిన్న ఆన్ లైన్ ఆర్డర్ నుంచి మొదలుకొని, బడా కంపెనీల దాకా విలువైన సమాచారం మాత్రమే కాదు వెబ్ సైట్స్ కూడా ఎప్పుడు ఎలా హ్యాక్ అవుతాయో తెలియదు. అయితే అలాంటి భయం లేకుండా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు ఎథికల్ హ్యాకర్స్. సైబర్ క్రిమినల్స్ వ్యూహాలకు చెక్ పెడుతూ సమాచారం హ్యాక్ అవ్వకుండా  అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్స్ కు మార్కెట్లో  ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

హైదరాబాదులో 50వేల మంది  

ప్రస్తుత డిజిటల్ వరల్డ్ లో ప్రతి పనీ ఆన్ లైన్లోనే నడుస్తోంది. అందుకే సైబర్ క్రిమినల్స్ వేల కిలోమీటర్ల దూరం నుంచే విలువైన సమాచారం నొక్కేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, కంపెనీల కీలక సమాచారం, ఆన్ లైన్ బిజినెస్ లావాదేవీలను హ్యాక్ చేస్తున్నారు. డబ్బులతో పాటు విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇలాంటి సైబర్ క్రిమినల్స్ ని పట్టుకోడానికి గతంలో నెలల తరబడి పట్టేది. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ జరిగి అకౌంట్స్, వెబ్ సైట్స్ హ్యాక్ అయితే... ఎథికల్ హ్యాకర్ల కోసం బెంగళూరు,  ముంబయి లాంటి నగరాలపై ఆధారపడేవాళ్ళు. సమస్య పరిష్కారానికి వారం రోజులు కూడా పట్టేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు. ఎంత పెద్ద సమస్య వచ్చినా నిమిషాల్లో ఎథికల్ హ్యాకర్లు పరిష్కరిస్తున్నారు. హైదరాబాద్ లోనే 50 వేల మంది దాకా ఎథికల్ హ్యాకర్లు అందుబాటులో ఉన్నారు. పెద్ద కంపెనీలు ఎథికల్ హ్యాకర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

కంపెనీలు, వెబ్ సైట్స్ నుంచి ఏ సమాచారం హ్యాక్ కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్లు ఏర్పాటు చేసుకుంటామని ఎథికల్ హ్యాకర్స్ చెబుతున్నారు. ఒకవేళ హ్యాక్ అయినా వెంటనే డేటా వెనక్కి వచ్చేలా చేస్తున్నారు. అయితే కంపెనీలు, సంస్థలు తమ సమాచారాన్ని ఒకే చోట ఎంట్రీ చేయొద్దనీ... కచ్చితంగా బ్యాకప్ పెట్టుకోవాలని ఎథికల్ హ్యాకర్లు సలహా ఇస్తున్నారు.

ఏ సమస్య వచ్చినా.. 

ప్రస్తుతం హ్యాకింగ్ కి సంబంధించిన ఏ సమస్యకైనా హైదరాబాద్ ఎథికల్ హ్యాకర్స్ వింగ్  వెంటనే పరిష్కరిస్తోంది. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్స్ లోనూ ఎథికల్ హ్యాకర్స్ కి చాలా డిమాండ్ ఉంది. మొబైల్స్, ల్యాప్ టాప్స్, సిస్టమ్స్  డేటా రికవరీని కూడా ఎథికల్ హ్యాకర్స్ రికవరీ చేస్తున్నట్టు టీటా ప్రెసిడెంట్ సందీప్ చెప్పారు. ఇండిపెండెంట్ గా చాలామంది పని చేస్తున్నారు. వన్ జీబీ డేటా బ్యాకప్ కి 5వేల నుంచి  10వేల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు తెలంగాణ టీటా  ప్రెసిడెంట్ సందీప్ తెలిపారు.

ప్రస్తుత ప్రపంచంలో వ్యాపార రంగంలో  పోటీ, లాభాలు సంపాదించడమే కాదు... డేటా సెక్యూరిటీపైనా దృష్టి పెట్టాలని ఫార్మ్ డైరీ కంపెనీ మేనేజర్ శర్మ తెలిపారు. కంపెనీ డేటా, బిజినెస్ లావాదేవీలు హ్యాకర్లకు చేరకుండా ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సిటీలో వేల రూపాయిల జీతాలతో ఎథికల్ హ్యాకర్ల రిక్రూట్ మెంట్ జరుగుతోంది. ఈ రంగంలో కొత్తగా వచ్చే వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు.