విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో.. చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీ.. భర్త మస్కట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. భార్య కూడా అక్కడే ఉంటుంది.. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. కొడుకు ఏమో అలహాబాద్ IITలో చదువుతున్నాడు.. చింత లేని చిన్న కుటుంబం.. బంధువుల పెళ్లి, దీపావళి వేడుకల కోసం మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చారు.. పెళ్లిలో సందడి చేశారు.. దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు.. విధి ఆడిన నాటకంలో ఇప్పుడు ఆ కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది.. కర్నూలు బస్సు యాక్సిడెంట్ తో తీరని విషాధం నింపింది. ఇది విధి రాతనా అంటూ అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తున్న విషాధ ఘటన ఇది..
మెదక్ మండలం శివ్వాయిపల్లికి చెందిన తల్లీ కూతుళ్లు మంగ సంధ్యారాణి (43), మంగ చందన (23) సజీవ దహనం అయ్యారు. సంధ్యారాణి భర్త మస్కట్ లో ఉండగా.. కొడుకు అలహాబాద్ లో ఉన్నారు. ఒకే కుటుంబంలో.. ఒకే ఘటనలో తల్లీకూతుళ్లు చనిపోవటం ఆ కుటుంబంలో విషాధాన్ని నింపింది.
ALSO READ : రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది ఇతడే
శివ్వాయిపల్లికి చెందిన మంగ ఆనంద్ కుమార్ గౌడ్ 2007 నుంచి మస్కట్ లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సంధ్యారాణి తో కలిసి మస్కట్ లోనే నివాసం ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కోసం కొన్ని రోజుల క్రితం భార్య భర్తలు ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్య రాణి హైదరాబాద్ వచ్చారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె చందన, అలహాబాద్ లో ఐఐటీ చదువుతున్న కుమారుడు వల్లభ కూడా తల్లితండ్రులను చూడటం కోసం హైదరాబాద్ వచ్చారు. పెళ్లి అయిపోయింది.. దీపావళి పండుగ కూడా చేసుకున్నారు.
దీపావళి తర్వాత భర్త ఆనంద్ కుమార్ గౌడ్ తిరిగి మస్కట్ వెళ్లిపోయాడు. భర్తతోపాటు మస్కట్ వెళ్లాల్సిన భార్య సంధ్యారాణికి జ్వరం రావటంతో.. ఆమె హైదరాబాద్ లోనే ఉండిపోయింది. కొడుకు వల్లభ అలహాబాద్ వెళ్లిపోయాడు. తల్లిని చూసుకోవటం కోసం కుమార్తె చందన కూడా హైదరాబాద్ లోనే ఉంది.
తల్లి సంధ్యారాణికి జ్వరం తగ్గిపోవటంతో.. కుమార్తెను బెంగళూరులో డ్రాప్ చేసి.. బెంగళూరు నుంచి మస్కట్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నది సంధ్యారాణి. ఈ క్రమంలోనే 2025, అక్టోబర్ 23వ తేదీ రాత్రి వీళ్లు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్నారు. కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర జరిగిన ప్రమాదంలో.. తల్లీకూతుళ్లు సంధ్యారాణి, చందన సజీవ సమాధి అయ్యారు. గుర్తు పట్టలేనంతగా వీరి శరీరాలు కాలిపోయాయి.
ఈ ఘటన ఆ కుటుంబంలో.. బంధువుల్లో తీవ్ర విషాధం నింపింది. వీరి విషయం తెలిసి విధి రాసిన రాత అంటూ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో బాగున్న కుటుంబం.. ఒకే ఒక్క రాత్రిలో చిన్నాభిన్నం అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
