వాస్తవాధీన రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చరమగీతం పాడుతూ ఇండియా, చైనాలు కీలక పెట్రోలింగ్ గస్తీలు ఇక నుంచి స్వేచ్ఛగా చేసుకోవచ్చనే అంగీకారం కుదరడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే, చైనా లోగుట్టును అంచనా వేయడం అతి కష్టమే అని గత చరిత్ర చెబుతోంది.
ఐరాస సర్వసభ్య సమావేశంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సిఓ) సమావేశంలో కూడా భారత విదేశాంగ శాఖామంత్రి మాట్లాడుతూ.. భారతదేశ ప్రాదేశిక సరిహద్దుల సమగ్రత, భద్రతలపై అటు డ్రాగన్ కన్ను, ఇటు పాకిస్థాన్ కుయుక్తులు గత ఏడు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయని బహిరంగంగానే ప్రకటించారు.
భారత భూభాగాన్ని ఆక్రమించడానికి, దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశాన్ని అస్థిరపరచడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే తుంచేస్తామని నిర్ద్వందంగా ప్రకటించడం హర్షదాయకం. గత కొన్నేళ్ళుగా బీజీంగ్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’లో భాగంగా కొనసాగుతున్న ‘చైనా,- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్(సిపిఈసి)’ అనైతిక మైత్రి వేదికగా.. జమ్ము- కాశ్మీర్ ప్రాంతంతోపాటు భారతదేశ నలుమూలల నుంచి చైనా భూఆక్రమణల పర్వం కొనసాగుతున్నదనే విషయం మనందరికీ తెలుసు.
1962 నుంచి డ్రాగన్ చొరబాట్లు
ఇండో – -చైనా యుద్ధం జరిగి 62 ఏండ్లు దాటుతున్నా.. డ్రాగన్ దుర్బుద్ధుల దాహానికి అంతమే కనిపించడం లేదని జయశంకర్ ప్రకటించడం సముచితంగా ఉన్నది. 2020 నుంచి నేటి వరకు దాదాపు 2000 చ.కి.మీ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారత రాజ్యాంగం లౌకిక, సామాజిక, సమైక్య, సార్వభౌమాధికార, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా తప్పని అత్యవసర పరిస్థితుల్లో ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించుకోవచ్చని, అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఇంచు భారత భూభాగాన్ని కూడా ఇతర దేశాలు దురాక్రమణ చేయడానికి అవకాశం ఇవ్వకూడదని పేర్కొనడం మన రాజ్యాంగ ప్రత్యేకతగా పేర్కొనాలి. భారత దేశానికి చుట్టూ 360 డిగ్రీల్లో ఇరుగు పొరుగు దేశాలతో చేతులు కలుపుతూ చైనా దురాక్రమణల ప్రయత్నాలు చేస్తున్నది. మన దేశ భద్రతకు భంగం కలిగించే చైనా కుయుక్తులు కోకొల్లలుగా కొనసాగడం
చూస్తున్నాం.
చైనా అనైతిక లాబీయింగ్
చైనా అనైతిక లాబీయింగ్ పర్వాలే కాకుండా చైనా మేడ్ చవకైన వస్తువులు ఇప్పటికే భారత్ మార్కెట్‌లోకి చొరబడి మన ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. నేడు అంతర్జాతీయ వేదికపై యూఎస్, యూరోప్ దేశాల ఒత్తిడితో చైనా కొంత వెనకడుగు వేస్తున్నప్పటికీ డ్రాగన్ దురాక్రమణల కాళ్లకు పూర్తిగా బంధాలు వేయలేకపోతున్నట్లు విదితమవుతున్నది. యూఎస్, యూరోప్ దేశాలు చైనా వస్తు దిగుబడులకు కళ్లెం వేయడం లేదా పన్నులు పెంచడం జరుగుతున్నా, ఆయా దేశాల స్వదేశీ వస్తు తయారీకి అధికధరలు పలకడం కూడా చైనాకు ముకుతాడు వేసే విషయంలో కొంత అవరోధంగా తోస్తున్నది. చైనా వస్తువుల దిగుబడులపై పరిమితులు విధించడంలో భారత్ మరింత చొరవ తీసుకోవలసి ఉన్నది.
గల్వాన్ ఘటన సాక్షిగా పెరిగిన ఉద్రిక్తతలు
జూన్ 2020లో లడక్ గల్వాన్ లోయలో చేసిన చైనా దురాక్రమణ సాహసానికి కల్నల్‌తో సహా 20 మంది భారతీయ జవాన్లు, అధిక సంఖ్యలో 45కు పైగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చూశాం. ఇలాంటి దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు భంగం కలిగించే ఘటనలు దేశ నలుమూలల నుంచి జరుగుతున్నవేళ భారత్ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి ఉపేక్షించకుండా తగు కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని గమనించాలి.
భారత్ చుట్టూ ఉన్న చిన్న చిన్న అభివృద్ధి చెందుతున్న దేశాల అంతర్గత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ, వారికి ఆర్థిక సహాయం చేస్తామనే ముసుగులో వాటిని చైనా తన కొంగున ముడేసుకొంటోంది. భారత్‌పై దురాక్రమణల పర్వానికి తెరలేపడంతో తన దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి భారత్ అహరహం భద్రత విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సి వస్తున్నది. జె అండ్ కె, అరుణాచల్, లడక్ ప్రాంతాల్లో చైనా, భారత్‌ల మధ్య అర్థంలేని భూవివాదాలు నిత్యం రగులుకుంటూనే ఉన్నాయి.
బీజింగ్‌కు ముకుతాడు వేయాలి
నేడు చైనాకు సమస్యగా నిలిచిన తైవాన్, టిబెట్, దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో భారత్ కూడా జోక్యం చేసుకొని బీజింగ్ దూకుడుకు ముకుతాడు వేయాలి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉంటుందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. తన దేశ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమాధికారాలకు భంగం కలుగకుండా భారత్ స్పష్టమైన విదేశాంగ విధానంతో ముందుకు సాగాల్సి ఉంది.
చైనా దూకుడును ముందే పసిగట్టి విరుగుడు మంత్రాంగం అమలు చేయాలని, దక్షిణ ఆసియా ప్రాంత దేశాల్లో చైనాకు దీటుగా బలమైన శక్తిగా భారత్ ఎదగాలని, చైనా ఉత్పత్తుల దిగుబడుల వరదలను క్రమంగా కత్తిరించడం జరగాలని, ముందు ముందు జరగనున్న ప్రపంచ దేశాల సదస్సు సాక్షిగా ఇరు దేశాల మధ్య ‘వాస్తవాధీన రేఖ’ లేదా ‘ఎల్ఏసీ’పై చర్చల ద్వారా సరైన పరిష్కారాలు వెతకాలని, భారత్ కన్నా చైనా పైచేయిగా ఉందనే దుస్థితిని రూపుమాపాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
