పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావనైనా చస్తా కానీ తిరిగి తన తండ్రి స్థాపించిన ఆర్జేడీ పార్టీలోకి మాత్రం వెళ్లనని తేల్చిచెప్పారు. శుక్రవారం (అక్టోబర్ 24) ఓ నేషనల్ మీడియా ఛానెల్ తో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ఆర్జేడీలోకి తిరిగి వెళ్లాల్సి వస్తే మరణాన్ని అయినా ఎంచుకుంటా కానీ తిరిగి ఆ పార్టీలోకి వెళ్లనని హాట్ కామెంట్ చేశారు. తనకు అధికార దాహం లేదని.. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, రబ్రీ దేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ ను బహిష్కరించారు లాలూ యాదవ్. దీంతో జనశక్తి జనతాదళ్ అనే కొత్త పార్టీ స్థాపించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు తేజ్ ప్రతాప్. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు నుంచే మహువా నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉందన్నారు. గతంలో తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. ఇక్కడ ప్రజల అభీష్టం మేరకు మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. మహువా నుంచి బరిలోకి దిగుతోన్న ఆర్జేడీ అభ్యర్థి ముఖేష్ రౌషన్‌ను సవాల్‌గా భావించట్లేదని అన్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లిదండ్రులతో కొన్ని రోజులుగా మాట్లాడటం లేదని.. కానీ వారి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడు తేజస్వీ యాదవ్‌ను మహాఘట్బందన్ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ.. ఎన్నికల ముందు ఇష్టమొచ్చిన ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణం. కానీ ప్రజల ఆశీస్సులు పొందినవారే అధికారాన్ని చేపడతారని అన్నారు.
ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెబుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. బీహార్ కోసం పనిచేయడమే మాత్రమే మా ఎజెండా అని స్పష్టం చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దుష్ట కుట్రలకు బీహార్ ప్రజలు ఇకపై మోసపోరని అధికార ఎన్డీఏ కూటమిపైన నిప్పులు చెరిగారు. కాగా, బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.
