అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే రకం కాదు: కోహ్లీ రిటైర్మెంట్‎పై గవాస్కర్ క్లారిటీ

అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే రకం కాదు: కోహ్లీ రిటైర్మెంట్‎పై గవాస్కర్ క్లారిటీ

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‎లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు. పెర్త్, ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో డకౌట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు కోహ్లీ. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. 

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నేరుగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‎లో బరిలోకి దిగిన కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తనకు ఘనమైన రికార్డులు ఉన్న ఆసీస్ గడ్డపై విరాట్ అదరగొడతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. 

దీంతో కోహ్లీ వన్డే రిటైర్మెంట్‎పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అడిలైడ్‌ వన్డేలో ఔటైన తర్వాత కోహ్లీ ప్రేక్షకులకు అభివాదం చేయడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీసే కోహ్లీకి చివరిదని ప్రచారం మరింత ఎక్కువైంది. కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం డౌటేనని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు గందరగోళానికి గురైతున్నారు. ఈ క్రమంలో కోహ్లీ రిటైర్మెంట్ వార్తలపై  టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తలను ఆయన తోసిపుచ్చారు. 

రెండు వైఫల్యాలకే కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చే రకం కాదని.. వచ్చే మ్యాచులో బలంగా పుంజుకోవాలని అతడు లక్ష్యం పెట్టుకుంటాడని చెప్పారు. అడిలైడ్‌లో ఔటైన కోహ్లీ ప్రేక్షకులకు అభివాదం చేయడం కేవలం ఫ్యాన్స్ కోసమేనని.. అది రిటైర్మెంట్‌కు సూచన కాదని గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు. విరాట్ భారీ స్కోర్ చేయకపోవడంతో ఆస్ట్రేలియన్లు కూడా నిరాశ చెందుతున్నారని అన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటం కోహ్లీ లక్ష్యంగా పెట్టుకున్నాడని పేర్కొన్నాడు సునీల్ గవాస్కర్.