దేశంలోని విద్యుత్ పంపిణీ రంగం కీలక మలుపు వద్ద నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న విద్యుత్ చట్ట సవరణ-2025 పారదర్శకత, వినియోగదారుల మన్ననలను పొందుతుందనే వాదన ఉన్నప్పటికీ, మరోవైపు ఇది ప్రజారంగ డిస్కంల పతనానికి దారి తీస్తుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. ఈ సవరణలోని ముఖ్యమైన అంశాలు చర్చించే ముందు డిస్కంల ప్రస్తుత స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు, విద్యుత్ రిటైల్ సప్లై పంపిణీ కోసం మొట్టమొదటి విద్యుత్ సంస్కరణల్లో బాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు డిస్కంలు 1999, -2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు హైదరాబాద్ కేంద్రంగా సదరన్ డిస్కం, వరంగల్ కేంద్రంగా నార్తర్న్ డిస్కం వారసత్వంగా మిగిలాయి. టెలికాం రంగంలోలాగ డిస్కంలకు ఇతర పంపిణీ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పోటీ లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఏకఛత్రాధిపత్యం అన్నమాట.
ప్రభుత్వ అండదండలు, ఆర్థిక వెసులుబాట్లు అనేకం డిస్కంలకు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు తాము ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, రైతులకు ఉచిత విద్యుత్, వివిధ కేటగిరీ వినియోగదారులకు అందించే టారిఫ్ రిబేట్లు మొదలగువాటికి ప్రతిగా ప్రభుత్వాలు క్రాస్ సబ్సిడీలు డిస్కంలకు చెల్లించి వాటి మనుగడకు దోహదపడుతున్నాయి. కొన్నిసార్లు ఆలస్యమైనా కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేసిన విద్యుత్‌కు డిస్కంలు చెప్పే లెక్కల ప్రకారం నిధులు సమకూర్చుతున్నాయి.
ప్రస్తుతం డిస్కంల పరిస్థితి ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. సవరణ ముసాయిదాలో పేర్కొన్నట్లు దేశంలో డిస్కంలలో సుమారు రూ.6 లక్షల కోట్లకు పైగా పేరుకుపోయిన టెక్నికల్, కమర్షియల్ నష్టాలు చూపుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయా అన్నది మరింత లోతుగా విశ్లేషిస్తేగాని నిర్ధారించలేం. వారు చెపుతున్న నష్టాలకు కారణం విద్యుత్ చోరీ, మీటరింగ్ లోపాలు, బిల్లింగ్ లోపాలు, అధిక ఏటి&టి నష్టాలు. ఇంకా నిజమైన ఖర్చుకంటే తక్కువ టారిఫ్‌లు, అవి కూడా ప్రభుత్వాలు ఆలస్యంగా చెల్లించే సబ్సిడీలపై ఆధారపడే పరిస్థితి ఉందన్నది వాస్తవం.
ఉదయ్ పథకం
విద్యుత్ కొనుగోలు, నెట్‌వర్క్ నిర్వహణకు డబ్బు కొరతతో డిస్కంలు కొట్టుమిట్టాడుతున్నాయి. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉదయ్' వంటి పునరుద్ధరణ పథకాలు కూడా దీర్ఘకాలిక మార్పును తీసుకురాలేకపోయాయి. డిస్కమ్‌లను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలే నెట్టుకొస్తున్నాయే తప్ప స్వయం సమృద్ధిగా లేవు. అయితే ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరడానికి వివిధ కారణాలు, కేంద్రప్రభుత్వ పెత్తనం చెలాయిస్తుందేమో అనే భయాలతో సుముఖత చూపలేదు.
సవరణలో ఏముంది? ఈ బిల్లు ప్రధానంగా విద్యుత్ పంపిణీలో పోటీ
ప్రవేశపెట్టి నిర్మాణాత్మక మార్పులపై దృష్టి సారిస్తోంది. పంపిణీలో పోటీ, ఒకే ప్రాంతంలో అనేక సరఫరాదారులు, ఒకే వైర్లు నుంచి ఓపెన్ యాక్సెస్ విధానం తప్పనిసరి చేయడం, టారిఫ్ సంస్కరణలు, నిజమైన ఖర్చుకు సరితూగే టారిఫ్, క్రాస్ సబ్సిడీలు తగ్గింపు, సబ్సిడీల చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా వినియోగదారులకు నేరుగా జమ, క్యాప్టివ్ / ఓపెన్ యాక్సెస్, గ్రూప్ క్యాప్టివ్ వినియోగానికి సులభ నియమాలు, ఎనర్జీ స్టోరేజ్ కోసం ప్రైవేట్ రంగం కూడా నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశం, సాంకేతిక నవీకరణలు, మీటరింగ్, కనెక్టివిటీ ప్రమాణాల ఆధునికీకరణ తదితరాలు తప్పనిసరి చేయాలని ముసాయిదా నిర్దేశిస్తున్నది.
ఉద్యోగ సంఘాలు, రాష్ట్రాల నిరసనలు
ఈ సవరణను బ్యాక్‌డోర్ ప్రైవేటైజేషన్ అని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగుల్లో తమ ఉద్యోగ రక్షణపట్ల తీవ్ర భయాందోళనలు నెలకొన్న మాట వాస్తవం. సబ్సిడీలపై రాష్ట్రాల నియంత్రణ కోల్పోతామనే భయం కూడా ఉంది. విద్యుత్ పంపిణీలో ప్రైవేట్ పోటీదారుల నిజాయితీ ఎంత? వారు లాభదాయక నగర ప్రాంతాలను మాత్రమే ఉంచుకొని, నష్టాలకు కారణమయ్యే గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుత డిస్కంలకే వదిలివేస్తాయానే అనుమానం అందరిలో ఉంది. దేశవ్యాప్తంగా
రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల నిరసనలకు పిలుపులు గత మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
బాధ్యతతో కూడిన సంస్కరణ అయితేనే ..
ఈ ముసాయిదా బిల్లులో లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి. లాభాలపరంగా చూస్తే డిస్కంల ఆదాయ వసూళ్ల పెరుగుదల, ఆధునికీకరణ, పాత అప్పులు తీరే మార్గం ఉన్నాయి. వినియోగదారుల సేవలలో నాణ్యత మెరుగుపడుతుంది. నష్ట భయాలేమిటంటే ప్రభుత్వ డిస్కంల స్థానంలో ప్రైవేటు ఆధిపత్యం, రైతులు, గృహ వినియోగదారులపై టారిఫ్ భారం పెరిగే అవకాశం, డిబిటి సమయానికి చెల్లించకపోతే సమస్యలు ఉన్నాయి. బాధ్యతతో కూడిన సంస్కరణ అయితేనే ప్రయోజనం ఉంటుంది. ఈ చట్టం వినియోగదారునికి సరైన రక్షణ చర్యలతో అమలు చేస్తే విద్యుత్ రంగానికి బలాన్నిస్తుంది.
పేదలు, గ్రామీణ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగులకు న్యాయమైన ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలి. ప్రైవేటు ఏకఛత్రాధిపత్యం అదుపు చేసే రెగ్యులేటర్లు ఉండాలి. సబ్సిడీలను రాష్ట్రాలు సమయానికి చెల్లించే హామీ ఇవ్వాలి. ఇవి లేకపోతే, సంస్కరణల పేరు చెప్పి విద్యుత్ రంగాన్ని అస్థిరపరిచే ప్రమాదం ఉంది. డిస్కంలు పాతాలానికి పడిపోయే అవకాశం ఉంది. కావున మరింత లోతుగా విశ్లేషించి ఇందులో భాగస్వాములయ్యే వినియోగదారులు, ఉద్యోగులు, పోటీదారుల సలహాలు, ప్రజా సంఘాల సూచనలు స్వీకరించాలి.
- దురిశెట్టి మనోహర్,
రిటైర్డ్ ఏడీఈ
