ఆధునిక జీవితం పూర్తిగా రసాయనాల మయంగా మారిపోయింది. కృత్రిమ రసాయనాలు లేని ఆహారం, ఉత్పత్తులు అరుదు అంటే అతిశయోక్తి కాదు. అయితే, రసాయనాలలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి జీవిలో రసాయనాలు సహజంగా ఉంటాయి. అయితే, మనం చర్చించేది అటువంటి రసాయనాల గురించి కాదు. ఆధునిక, కృత్రిమ, సింథటిక్ రసాయనాలు గురించి.. ఇవి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఉదయం పండ్లు తోముకునే టూత్ పేస్టు దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు కొందరు విధిగా వాడే దోమలను నివారించే లిక్విడ్ల వరకు అన్నింటా రసాయనాలే. ఆహార పదార్థాలలో, ఆహార పాత్రలలో, వస్త్రాలలో, ప్రతి ‘ఆధునిక’ వస్తువులో వివిధ రూపాలలో, ఇంట, బయట, ప్రతిరోజూ నిత్యం ప్రజలు ఆయా పరిస్థితులలో హాని కలిగించే వివిధ రకాల రసాయనాలు ఎదుర్కొంటున్నారు. కానీ, వాటి పట్ల ప్రజల్లో ఎటువంటి అవగాహన లేదు.
ప్ర కృతిలో, పర్యావరణంలో, వాతావరణంలో ఈ రసాయనాల వినియోగం అత్యంత అవసరం అని చెప్పే రసాయన శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేకపోలేదు. వీరి వల్లనే ఇవి విస్తృతం అయ్యాయి. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, అవసరార్థం ఈ రసాయనాల ఉపయోగం పెరిగింది. మొదట్లో రసాయనాలు ఆహారం జోలికి తీసుకురాలేదు. కానీ, ఎప్పుడైతే రసాయనాలతో కూడిన వ్యవసాయం వచ్చిందో అప్పటి నుంచి వీటి ఉపయోగం, అవశేషాలు ఆహారంలో పెరిగాయి.
స్కిల్ అగ్రికల్చర్ స్థానంలో కిల్ అగ్రికల్చర్ వేళ్లూనుకుని క్రమంగా మానవేతర జీవాలతో మొదలై చివరికి మనుషులను చంపేస్థాయిలో వీటి అవశేషాలు పెరిగిపోయాయి. రసాయన పరిశ్రమ మద్దతుదారులు మాత్రం రసాయనాల మీద వితండవాదం చేస్తున్నారు. నీరు, ప్రాణవాయువు (ఆక్సిజన్) కూడా రసాయనాలే అని, మానవ శరీరమే రసాయనాలమయం కాబట్టి వాటి గురించి ఆందోళన వద్దు అంటున్నారు. రసాయనాల వల్ల హాని ఏమి, ఎట్లా, ఎంత వాడుతున్నారు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది అని వారి వాదన. కొందరు అయితే రసాయనాలు నేరుగా తీసుకున్నా సమస్య రాదు అని ప్రకటించి భంగపడ్డారు. నీరు తాగి, ప్రాణవాయువు పీల్చి మనుషులుగాని, పశువులుగాని చనిపోయిన సందర్భాలు లేనప్పుడు, వాటిని ఇతర సింథటిక్, కృత్రిమ రసాయనాలతో పోల్చడం సరికాదు.
ప్రజారోగ్యంపై దుష్ప్రభావం
1950లలో అమెరికాలో రసాయనాల వల్ల ఏర్పడే ముప్పు ప్రజారోగ్యంపై దుష్ప్రభావం గురించి, ముఖ్యంగా పారిశ్రామిక కాలుష్యం, ఆందోళన పెరిగింది. రసాయన కర్మాగారాల నుంచి వచ్చే వాయు, నీటి కాలుష్యం సమీప నివాసితులను, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్, పిట్స్‌బర్గ్ వంటి పారిశ్రామిక కేంద్రాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. కృత్రిమ రసాయనాలు, ముఖ్యంగా పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను శాస్త్రవేత్తలు, పౌరులు గుర్తించడం, కాలుష్యాన్ని ప్రశ్నించడంప్రారంభించారు. రాచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ 1962 ప్రచురించకముందే పర్యావరణ అవగాహనకు 1950లలోనే బీజాలు పడ్డాయి.
అయినా కూడా 1950లలో అమెరికా రసాయన పరిశ్రమ ప్రభుత్వ నిర్ణయాలపై బలమైన ప్రభావాన్ని చూపింది. రసాయనాలను ఆధునిక జీవితానికి ఇంజిన్‌గా, సాంకేతిక, ఆర్థిక పురోగతికి చోదకంగా చిత్రీకరించారు. సింథటిక్ ఉత్పత్తులు ఇళ్లను శుభ్రంగా, ఆహారాన్ని తాజాగా, మానవ జీవితాన్ని ఎలా సులభతరం చేస్తాయో వాణిజ్య ప్రకటనలు ఊదరగొట్టాయి. ఆరోగ్యకరమైన, తెగుళ్లు లేని వాతావరణానికి శుద్ధి చేసే రసాయనాలు, కీటకనాశక రసాయనాలను సాధనాలుగా మార్కెట్ చేశారు. ఈ ప్రకటనలు రసాయన శాస్త్రం కేవలం ఒక శాస్త్రం కాదు-. అది ఒక జీవనశైలి అనే ఆలోచనను బలోపేతం చేయడానికి సహాయపడ్డాయి.
3,50,000 కంటే ఎక్కువ రసాయనాలు
ఆహారంలో రసాయనాల కల్తీ నివారణకు 2006లో తెచ్చిన చట్టం పూర్తిస్థాయిలో ఇప్పటికీ అమలు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉపయోగం కోసం నమోదైన రసాయనాలు, రసాయన మిశ్రమాలు 3,50,000 కంటే ఎక్కువ ఉన్నాయి. వాటి నుంచి తయారు చేయగలిగే రసాయన సమ్మేళనాల (కెమికల్ కాంపౌండ్స్) సంఖ్య అనంతం. ఈ లెక్క 2020లో 19 దేశాలలో నిర్వహించే రసాయనాల జాబితా నుంచి సేకరించింది. వీటిలో 1,20,000 ఖచ్చితంగా గుర్తించలేని పదార్థాలు కూడా ఉన్నాయి.
విష పదార్థాల నియంత్రణ చట్టం ( టీఎస్సీఏ) ప్రకారం, అమెరికా దేశ పర్యావరణ పరిరక్షణ సంస్థ అమెరికాలో తయారైన లేదా ప్రాసెస్ చేసిన రసాయనాల జాబితాను నిర్వహిస్తుంది. ఈ టీఎస్సీఏ కెమికల్ సబ్‌స్టాన్స్ ఇన్వెంటరీలో దాదాపు 84,000 రసాయనాలు ఉన్నాయి. 2016లో సవరించిన టీఎస్సీఏ ప్రకారం, రసాయన తయారీదారులు తాము ఉపయోగించే రసాయనాన్ని ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. ఆ రకంగా తయారైన తాజా జాబితాలో 38,304 రసాయనాలు ఉన్నాయి అంటున్నారు. రంగాలవారీగా చూస్తే ప్లాస్టిక్‌లలో 13,000 కంటే ఎక్కువ రసాయనాలు, ఔషధ తయారీలో వేల సంఖ్యలో రసాయనాలు ఉపయోగిస్తున్నారు.
సమగ్ర చట్టం లేదు
నియంత్రణ సంస్థలు పరిమాణం (వాల్యూమ్), ఆశిస్తున్న ప్రమాదం (ఎక్స్‌పోజర్), విషం స్థాయి ఆధారంగా రసాయనాలకు ప్రాధాన్యత ఇస్తాయి. ప్రపంచ రసాయన పర్యవేక్షణలో అనేక లోపాలు, అంతరాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా, జరిగే హాని కూడా తెలియని రసాయనాల ఉత్పత్తికి, వ్యాపారానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి. చైనా, భారతదేశం, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా ప్రపంచ రసాయన వాణిజ్యంలో 40% వాటా దక్కించుకున్నాయి. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలను వెనక్కునెట్టాయి. రసాయన ఉత్పత్తి, వినియోగంలో చైనా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, భారత్, జపాన్ అగ్రభాగాన ఉన్నాయి. ఒక్కొక్క దేశం ప్రపంచ రసాయన పరిశ్రమలోని వివిధ విభాగాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
చైనా పరిమాణం, ఆదాయపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన ఉత్పత్తిదారు. ప్రాథమిక రసాయనాలు, ఎరువులు, ప్లాస్టిక్‌లు, ఔషధ పదార్థాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది. స్పెషాలిటీ కెమికల్స్, పెట్రోకెమికల్స్, బయోటెక్నాలజీ ఆధారిత రసాయనాలలో అమెరికా దేశం అగ్రగామి. భారత్ రసాయన రంగం వ్యవసాయ రసాయనాలు, ఔషధాలు (ఫార్మా), రంగులలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అయితే, భారతదేశంలో ఒక సమగ్ర చట్టం లేదు. జాతీయ రసాయనాల జాబితా కూడా లేదు.
భద్రతా సమాచారం అందులో ఉండాలి
డెల్టా భూములు, దిబ్బ ప్రాంతాల వంటి సున్నితమైన పర్యావరణాలలో వివిధ జీవాల ఆవాసాల క్షీణతకు, జాతుల అంతర్ధానానికి రసాయన కాలుష్యం దోహదం చేస్తుంది. కలుపు సంహారకాలు, భార లోహాల రసాయనాలు నేల నాణ్యతను క్షీణింపజేస్తాయి, సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని తగ్గిస్తాయి. రసాయనాల గురించిన హాని, భద్రత సమాచారం ఆయా వస్తువులు, పదార్థాలు, ఉత్పత్తుల వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. వివిధ రసాయనాలు ఉపయోగించే పరిశ్రమల మీద రసాయనాల వల్ల కలిగే హాని, తీసుకునే భద్రతా చర్యలు, రసాయనాల గుణాలు గురించి పారదర్శక సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నది.
రసాయనాల తయారీలో, ఉపయోగంలో, రవాణాలో, వాణిజ్యంలో పరిశ్రమ, పరిశోధన సంస్థల బాధ్యతను వారికి గుర్తుచేస్తూ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ, పరిశీలన వంటి చర్యలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రసాయనాల సంఖ్య తగ్గించాలి. రసాయనాల ఉపయోగం క్రమంగా, వేగంగా తగ్గించాలి. రసాయన రహిత పరిష్కారాల వైపు అడుగులు వెయ్యాలి. ఇప్పటికే జీవాలలో, పర్యావరణంలో పేరుకుపోయిన రసాయన అవశేషాలను వెలికితీయాలి. కృత్రిమ రసాయనాలను విచ్ఛిన్నం చేసి సాధారణ రసాయనాల స్థితికి తీసుకురావాలి.
భవిష్య జాతిపై ప్రభావం
భవిష్య జాతి మీద రసాయనాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నాయి. సంతతి ఆకృతి, ఆరోగ్యం, పరిణతి వగైరా అంశాల మీద దుష్ప్రభావం ఇప్పుడు జన్యుపరమైన మార్పులుగా గుర్తిస్తున్నాం. రసాయనాల వల్ల జన్యుమార్పిడి ఏర్పడి మనుషులతో సహా అన్ని రకాల జీవాల శరీరాకృతి గుణాత్మక మార్పుకు రసాయనాలే కారణం. అంగవైకల్యంతో, మానసిక వైకల్యాలతో పిల్లలు పుట్టడానికి కారణం తల్లిదండ్రుల శరీరాల మీద జరిగిన రసాయన దాడి ఫలితమే. కొన్ని రసాయన కాలుష్య కారకాలు కార్బన్ సైక్లింగ్‌ను ప్రభావితం చేయడం, సహజ కార్బన్ సింక్‌లను దిగజార్చడం ద్వారా వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి.
ఒక జాతికి హాని కలిగించేది పర్యావరణ వ్యవస్థలను అల్లకల్లోలం చేస్తుంది. ఇది వేటాడే జంతువులు, ఆహారం, వృక్ష జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రసాయనాలు జంతువుల ప్రవర్తనను మార్చగలవు, సంతానోత్పత్తిని తగ్గించగలవు, పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తాయి. ఉదాహరణకు, కీటకనాశక రసాయనాలు తేనెటీగల జనాభా తగ్గుదలకు, ఉభయచర జీవాలలో వైకల్యాలకు కారణమవుతున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
