74 ఏళ్ల వయసులో 11 డ్రైవింగ్ లైసెన్స్‎లు.. బస్సులు, లారీలు అవలీలగా డ్రైవ్ చేస్తూ ఔరా అనిపిస్తోన్న భామ..!

74 ఏళ్ల వయసులో 11 డ్రైవింగ్ లైసెన్స్‎లు.. బస్సులు, లారీలు అవలీలగా డ్రైవ్ చేస్తూ ఔరా అనిపిస్తోన్న భామ..!

ఏజ్ జస్ట్ ఏ నెంబర్.. పట్టుదల, కృషి, సాధించాలనే కసి ఉంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. ఈ విషయాన్ని చేతల్లో నిరూపించారు కేరళకు చెందిన మణి అమ్మ అనే వృద్ధురాలు. 74 ఏళ్ల వయసులో ఏకంగా 11 డ్రైవింగ్ లైసెన్స్‎లు కలిగి ఉన్నారు మణి అమ్మ. ఇందులో హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండటం విశేషం. ఏడు పదుల వయసులో కూడా ఎలాంటి భయం, బెరుకు లేకుండా బస్సులు, క్రేన్లు, లారీలు వంటి భారీ వాహనాలను అవలీలగా డ్రైవ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు మణి అమ్మ. 

మణి అమ్మది కేరళలోని ఒక చిన్న పట్టణం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆమె తండ్రి కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాడు. మణి అమ్మకు చిన్నప్పటి నుంచే డ్రైవింగ్ అంటే ఎంతో ఆసక్తి కానీ భయం. 10వ తరగతి ఆయిపోగానే ఆమెకు పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత ఇళ్లు, పిల్లలతో ఆమె జీవితం బిజీగా మారిపోయింది. దీంతో ఆమె డ్రైవింగ్ కల కళగానే మిగిలిపోయింది. కానీ ఆమె తన కలను సాకారం చేసుకోవాలని కంకణం కట్టుకుంది. 

ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త కూడా ఆమె మద్దతుగా నిలిచాడు. భర్త సపోర్ట్, డ్రైవింగ్ నేర్చుకోవాలన్ని పట్టుదలతో చివరకు అనుకున్నది సాధించింది. అయితే.. మణి అమ్మ ఆషామాషీగా బైక్, కారు డ్రైవింగ్‎తోనే ఆగిపోలేదు. తనలో ఉన్న భయాన్ని వదిలిపెట్టి బస్సులు, లారీలు, క్రేన్లు వంటి భారీ వాహనాలను కూడా అవలీలగా నడిపింది. తద్వారా 74 ఏళ్ల వయసులో ఏకంగా 11 డ్రైవింగ్ లైసెన్స్‎లు పొందింది మణి అమ్మ. 

ఒకప్పుడు డ్రైవింగ్ అంటేనే భయపడిన మణి అమ్మ.. ఇప్పుడు సునాయసంగా బస్సులు, లారీలు, క్రేన్లు, ట్రక్కులు వంటి హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయడం చూసి ఔరా అంటున్నారు. డ్రైవింగ్ చేయడమే కాకుండా తన భర్తతో కలిసి డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించారు మణి అమ్మ. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండి భయాన్ని వదిలేస్తే ఏదైనా సాధ్యమే అని మణి అమ్మ నిరూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. 

మణి అమ్మ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి లింక్డ్ఇన్‌లో ది బెటర్ ఇండియా అనే అకౌంట్‎లో షేర్ చేశారు. పోస్ట్ యథాతథంగా  ‘‘74 ఏళ్ల వయసులో కార్లు మాత్రమే కాకుండా బస్సులు, క్రేన్లు, ట్రక్కులు నడపడానికి ఏమి అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా..? కేరళలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి 10వ తరగతి పరీక్షల తర్వాత వివాహం చేసుకున్న మణి అమ్మ ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఆమె తండ్రి కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాడు. 

ఆమె చిన్నతనంలో ఎప్పుడూ డ్రైవింగ్ చేయలేదు. 1981లో తొలిసారి ఆమె వాహనం నడుపుతున్నప్పుడు భయపడింది. ఎవరినైనా ఢీకొడుతుందేమోనని టెన్షన్ పడింది. కానీ డైలీ ప్రాక్టీస్, భర్త నిరంతర ప్రోత్సాహంతో మణి అమ్మ ఆ భయాన్ని వీడింది. కాలక్రమేణా ఆమె భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్‌లతో సహా పదకొండు డ్రైవింగ్ లైసెన్స్‌లను సంపాదించింది. ఇప్పుడు ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి భర్తతో కలిసి ఒక డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించారు’’ అని పోస్టులో పేర్కొన్నారు. 

ఏజ్ జస్ట్ ఏ నెంబర్.. పట్టుదల, కృషి, సాధించాలనే కసి ఉంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదంటూ మణి అమ్మ రుజువు చేశారని ఆమెను కొనియాడారు. మీరిది చేయలేరు, ఇది మీ వయస్సుకి తగినది కాదు అని విమర్శలు ఎదుర్కొన్న ప్రతి స్త్రీ మణి అమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పోస్టులో సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‎గా ఉంటే ఆనంద్ మహీంద్రా కూడా మణి అమ్మ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రశంసించారు.