అనంత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పతంగ్ లు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. సెలవులు వచ్చాయి. దాంతో ప్రతిరోజూ ఉదయం స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసుకునేవాడు. సాయంత్రం పతంగ్ ఎగరేసేవాడు. ఒకరోజు పతంగ్ ఎగరేస్తుంటే తెగిపోయి, వాళ్ళ ఇంటి పక్కనున్న సందులో పడిపోయింది. ఆ గాలిపటాన్ని వెతుక్కుంటూ వెళ్తే, అది ఒక పూరిగుడిసె పక్కనున్న వేపచెట్టుకు చిక్కుకుని కనిపించింది.
ఆ పూరిగుడిసెను చూడగానే తన బాల్యం గుర్తొచ్చింది అనంత్ కు ఇప్పుడైతే స్కూల్ కు రోజూ సైకిల్ మీద వెళ్తున్నాడు. కానీ చిన్నప్పుడు రిక్షాలో వెళ్లేవాడు. ఆ గుడిసె చిన్నప్పుడు తనను పాఠశాలకు తీసుకెళ్లిన రిక్షా సోమయ్యది. సోమయ్య ఇంటి దగ్గరే ఉన్నాడు. రిక్షా కూడా గుడిసె పక్కనే ఉంది. అనంత్ ను చూసి పలకరించాడు సోమయ్య. "పతంగ్ వేపచెట్టుకి చిక్కుకుంది" అన్నాడు అనంత్.
వెంటనే ఒక పొడుగాటి కర్ర తెచ్చాడు సోమయ్య. దాంతో గాలిపటాన్ని తీశాడు అనంత్. పతంగ్ తీశాక సోమయ్యను పరిశీలనగా చూసి "ఎలా ఉన్నావు సోమయ్యా?" అని అడిగాడు అనంత్."ఏదో ఇలా ఉన్నాను బాబు. ఇదివరకటిలాగా ఇప్పుడు రిక్షాలకు బేరాలు లేవు. ఆటోలు పెరిగిపోయాయి. కూతురికి పెండ్లి చేశా. కొడుకు కూలిపనికి పోతాడు. ఏదో బతుకుతున్నా" అన్నాడు సోమయ్య.
"రిక్షా లాగడం మానేసి నువ్వు కూడా కూలీకి వెళ్ళొచ్చు కదా" అన్నాడు అనంత్. “చిన్నప్పట్నించీ నాకు తెలిసింది ఇదే పని. నేను ఇంకో పని చేయలేను” అన్నాడు సోమయ్య. ఇంటికొచ్చాక కూడా సోమయ్య గురించి ఆలోచించాడు అనంత్. సోమయ్య చాలా మంచివాడు. తన చిన్నప్పుడు తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగి, చాలా రక్తం పోయింది. అప్పుడు సోమయ్య రక్తం ఇచ్చి కాపాడాడు.
అటువంటి సోమయ్య ఈ రోజు గడవని స్థితిలో ఉన్నాడు. అతని కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు అనంత్. సోమయ్య గురించి తన తండ్రికి చెప్పాడు అనంత్. మర్నాడు సోమయ్యను కలిశాడు అనంత్. "మా నాన్నకు తెలిసిన ఆటో నడిపే ఒకతను ఉన్నాడు. అతని దగ్గర నీకు ఆటో నడపటం నేర్పించి, నువ్వు ఆటో కొనుక్కోవటానికి సాయం చేస్తా అన్నాడు నాన్న" అని చెప్పాడు అనంత్.
"నువ్వు, మీ నాన్నగారు నా మీద చూపుతున్నదయకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఈ వయసులోనేను కొత్తగా ఆటో నేర్చుకుని, నడపలేను" అన్నాడు సోమయ్య. అతనికి ఏ విధంగా సాయం చేయాలో అర్థం కాలేదు అనంత్ కు. కొన్ని రోజులు ఆలోచించాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి తండ్రికి చెప్పాడు అనంత్. తండ్రి మెచ్చుకున్నాడు.
మరుసటి రోజు సోమయ్య ఇంటికెళ్లాడు అనంత్, విషయం చెప్పాడు. అనంత్ చెప్పింది సోమయ్యకు బాగా నచ్చింది. అనంత్ తండ్రిని కలిసి, వారం రోజుల్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు సోమయ్య, చాలా సంవత్సరాల తర్వాత ఇంతకుముందులా సంతోషంగా ఉన్నాడు సోమయ్య.
ఒకరోజు అనంత్ వాళ్ళ ఇంటికెళ్లి అనంతు, అతని తండ్రికి కృతజ్ఞతలు తెలిపాడు సోమయ్య. “ఇదివరకు సోమయ్యకు పని లేకపోవడానికి, ఇప్పుడు తీరిక లేనంతగా పని దొరకటానికి కారణం ఏమిటి?" అడిగింది అనంత్ తల్లి."ఆటోలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మామూలు రిక్షాలు ఎక్కేవాళ్లు తగ్గిపోయారు.
అందుకే ఆ రిక్షాను ప్లాట్ ఫారమ్ రిక్షాగా మారిస్తే సామాన్ల రవాణాకు పనికొస్తుందని అనంత్‌కి అనిపించింది. అలా సోమయ్య మామూలు రిక్షా కాస్తా ప్లాట్ ఫారమ్ రిక్షాగా మారింది. తీరికలేనంత పని దొరికింద"ని చెప్పాడు అనంత్ తండ్రి.
