అమృత్ భారత్ స్కీంకు మరో 57 స్టేషన్లు ఎంపిక

అమృత్ భారత్ స్కీంకు మరో 57 స్టేషన్లు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జోన్ లో మరో 57 స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.  అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం రినోవేషన్(పునరుద్ధరణ) చేస్తోంది. ఇప్పటికే దక్షిణ జోన్ లో  64 స్టేషన్లలో రెనోవేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ నెల 26న దేశ వ్యాప్తంగా మరో 550 స్టేషన్ల రెనోవేషన్ కు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. 

ఇందులో మన జోన్ నుంచి 57 స్టేషన్లు ఉన్నాయని  రైల్వే అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ డివిజన్ లో  గద్వాల్, జడ్చర్ల, షాద్ నగర్,  ఉందా నగర్(శంషాబాద్), యాకుత్ పురా, మేడ్చల్, మెదక్, బాసర, ధర్మాబాద్, ఉమ్రి స్టేషన్లు లిస్టులో ఉన్నాయి. ఫ్లాట్ ఫామ్స్, వెయిటింగ్ ఏరియా, సోలార్ పవర్, పార్కింగ్ ఏరియాలు, బుకింగ్ ఆఫీస్, ఎస్కలేటర్లు, లిఫ్ట్ ల వంటివి రినోవేషన్ చేయనున్నారు.