- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: దేశంలో అమృత్ భారత్ రైళ్లు ప్రతి పేద కుటుంబానికి వరంగా మారనున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ రైళ్లల్లో ప్రయాణం చౌకగా, సౌకర్యవంతంగా ఉండి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 133 అమృత భారత్ ట్రైన్ల తయారీ వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.
తక్కువ ధరలో ప్రయాణం అందించడమే కాకుండా, మెరుగైన సౌకర్యాలు, శుభ్రత, సౌకర్యవంతమైన సీట్లు వంటి అంశాలు ఈ రైళ్లలో ప్రధాన ప్రత్యేకతలుగా ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతతో ఈ రైళ్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ రైళ్లు సిద్ధమవుతున్నాయన్నారు. దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
