హైదరాబాద్​ బిర్యానీ వారెవ్వా.. డైలీ 10 లక్షలకు పైనే ఆర్డర్లు..

హైదరాబాద్​ బిర్యానీ వారెవ్వా.. డైలీ 10 లక్షలకు పైనే ఆర్డర్లు..
  •  
  • సిటీలో 20 వేలకు పైగా రెస్టారెంట్లు, హోటళ్లు
  • తక్కువ ధరకే బిర్యానీ.. రూ.90 నుంచే రేట్లు
  • అర్ధరాత్రి దాకా అవైలబులల్‌‌.. ఆర్డర్లే ఆర్డర్లు
  • హైదరాబాద్ బిర్యానీకి సెలబ్రిటీలు కూడా ఫిదా

హైదరాబాద్/మెహిదీపట్నం/సికింద్రాబాద్, వెలుగు: పెండ్లికైనా.. బర్త్​డేకైనా.. దోస్తులు కలిసినా.. చుట్టాలు వచ్చినా.. వేడుక ఏదైనా.. దావత్ ఎప్పుడైనా.. హాట్‌‌హాట్‌‌ బిర్యానీ ఉండాల్సిందే! తినాలనిపిస్తే ఆర్డర్ చేసుడే! హైదరాబాద్‌‌కు ఎవరన్న వస్తే.. చార్మినార్ చూడకుండా పోతరేమో కానీ.. బిర్యానీ రుచి చూడకుండా మాత్రం పోరు. హైదరాబాద్‌‌లో డైలీ 10 లక్షలకుపైగా బిర్యానీలు బుక్ అయితున్నయంట. ఇగ ఆఫ్‌‌లైన్‌‌లో తీసుకెళ్లేటోళ్లకు లెక్కేలేదు.

బిర్యానీ క్యాపిటల్

ప్రపంచంలో హైదరాబాద్‌‌ బిర్యానీకి ప్రత్యేక స్థానముంది. ఇక్కడికి వచ్చేటోళ్లు బిర్యానీ టెస్ట్ చేసిగానీ వెళ్లరు. కొందరైతే బిర్యానీ కోసం ప్రత్యేకంగా వస్తుంటరు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, స్టార్ బ్యాట్స్‌‌మన్ విరాట్ కోహ్లీ వంటి ఎంతో మంది ఇక్కడి బిర్యానీ రుచి చూసినవాళ్లే. 

నగరంలో దాదాపు 20 వేల రెస్టారెంట్లు, హోటల్స్ బిర్యానీని అందిస్తున్నాయి. ఇందులో స్టార్ హోటల్స్ నుంచి గల్లీల హోటళ్ల వరకు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 75 మంది నుంచి వంద మందికి సర్వ్ చేసే హండీలు దాదాపు 40 వేల వరకు రోజూ అమ్ముడుపోతున్నాయి. అన్ని రకాల ఆన్ లైన్ సంస్థల నుంచి నేరుగా హోటల్స్, రెస్టారెంట్లకి డైలీ 10 లక్షలకుపైగా బిర్యానీలు బుక్‌‌ అవుతున్నాయి. ఆఫ్‌‌లైన్‌‌లో ఇంతకు రెట్టింపుగానే ఉంది.

ఫేమస్ బిర్యానీ సెంటర్లు

మదీనా, ప్యారడైజ్‌‌, కేఫ్ బహార్, షా గౌస్‌‌, అల్ఫా, అజీజియా, ఆస్టోరియా, బావర్చీ, గార్డెన్ రెస్టారెంట్, పిస్తా హౌజ్ సెంటర్లు సిటీలో చాలా ఫేమస్. వీటికి హైదరాబాద్‌‌లో పలు బ్రాంచ్‌‌లు ఉన్నాయి. ఒకప్పుడు సికింద్రాబాద్‌‌కే పరిమితమైన ప్యారడైజ్‌‌ బిర్యానీ సెంటర్.. 34 బ్రాంచ్‌‌లు ఏర్పాటు చేసింది. రోజుకు ఒక్కో సెంటర్‌‌‌‌లో 300 వరకు హండీ బిర్యానీలు సేల్ అవుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌‌కు రోజూ సుమారు పదివేల మంది నుంచి 15 వేల మంది దాకా బిర్యానీ కోసం వస్తుంటారు. వీకెండ్స్ లో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. అక్కడి టేక్ అవే సెంటర్‌‌‌‌లో రోజుకు 20 వేలకి మించి పార్సిల్స్ వెళ్తుంటాయి. మరో ఫేమస్ బిర్యానీ సెంటర్ షాగౌస్. పదేండ్ల క్రితం ఒక సెంటర్ తో ప్రారంభమైన ఈ హోటల్ ప్రస్తుతం ఏడు బ్రాంచ్ లను ప్రారంభించింది. అందులో శాలిబండకు చెందిన షాగౌస్ హోటల్ ఫేమస్. దమ్ బిర్యానీ కోసం కస్టమర్లతో ఈ హోటల్ ఎప్పుడు కిటకిటలాడుతుంది. ఉదయం పూట పాయ కోసం క్యూ కడుతారు. అర్ధరాత్రి దాకా కూర్చునేందుకు ప్లేస్ కూడా దొరకనంత మంది ఉంటారు. ఆర్టీసీ క్రాస్‌‌ రోడ్స్‌‌లో ఉన్న బావర్సీ కూడా  ఎంతో పాపులర్.

తినాలనిపిస్తే చాలు..

హైదరాబాదీలకు సందర్భం ఏదైనా బిర్యానీ మస్ట్‌‌గా ఉండాల్సిందే. దావత్​లు, ఫెస్టివల్స్ లో ఎన్ని రకాల వంటలు పెట్టినా ‘బిర్యానీ లేదా?’ అని అడిగేటోళ్లు ఎందరో. అందుకే ఇటీవల చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ ఐటమ్‌‌ని తప్పనిసరి ఉంచుతుతారు. మరోవైపు బిర్యానీతో ఫంక్షన్లు ఈజీగా అయిపోతయ్. హోటల్స్​ నిర్వహకులకు ఆర్డర్ చేస్తే హండీ తీసుకొచ్చి వారే సర్వ్ చేసి వెళ్తారు. ఇలా బర్త్ డే పార్టీ నుంచి మొదలుపెడితే పెండ్లిళ్ల వరకు బిర్యానీ పెడుతున్నారు. రంజాన్ మాసం, న్యూ ఇయర్‌‌‌‌తోపాటు వీకెండ్స్‌‌లో సేల్స్‌‌ ఎక్కువగా ఉంటున్నట్లు హోటల్స్‌‌ నిర్వాహకులు చెబుతున్నారు.

కుండలు.. బకెట్లు.. డబ్బాలు..

బిర్యానీ ప్రియులు పెరిగిపోయే కొద్దీ కొత్త రకాలుగా అమ్మకాలు షురూ అయ్యాయి. కుండ బిర్యానీ, బకెట్ బిర్యానీ, డబ్బా బిర్యానీ అంటూ కొత్త తరహా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. రేట్లు కూడా అందుబాటులో ధరలోనే ఉండటంతో జనం మిగతా ఫుడ్‌‌తో పోలిస్తే బిర్యానీకే మొగ్గు చూపుతున్నారు. స్టార్ హోటల్స్​ నుంచి స్ర్టీట్ ఫుడ్ సెంటర్‌‌‌‌ వరకు రేట్లు రీజనబుల్‌‌గానే ఉంటున్నాయి. హైదరాబాద్‌‌లో రూ.90 నుంచి వేలల్లో కూడా బిర్యానీ లభిస్తుంది. ప్రస్తుతం రెడీమేడ్ మాసాలాలు కూడా లభిస్తుండటంతో ఇండ్లలోనూ వీకెండ్స్‌‌లో బిర్యానీ తయారు చేసుకుంటున్నారు.

ఆన్‌‌లైన్ ఆర్డర్లలో టాప్

ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ బిర్యానీ ఆర్డర్లపై ఓ నివేదిక రిలీజ్ చేసింది. అందులో హైదరాబాదీలు గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా.. గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని చెప్పింది. గత ఐదున్నర నెలల్లో 50 లక్షల ఆర్డర్లతో రెండో స్థానంలో బెంగళూరు.. 30 లక్షల ఆర్డర్లతో మూడో స్థానంలో చెన్నై నిలిచాయి. నగరంలో కూకట్ పల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. 

కస్టమర్లు పెరుగుతున్నరు

పాతబస్తీలోని శాలిబండలో 1980లో షా గౌస్ హోటల్ ఏర్పా టు చేసినం. మా హోటల్‌‌లో సుగంధ ద్రవ్యాలతో బిర్యానీ చేస్తం. చాలా మంది ఇష్టపడతారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో మేమేప్పుడు రాజీ పడం. అందుకే షా గౌస్ బిర్యానీకి కస్టమర్లు పెరుగుతున్నారు. అన్నిచోట్ల కలిపి డైలీ 25 వేలకి పైగా బిర్యానీలను అమ్ముతున్నం. చికెన్, మటన్  పాయాకి ఫుల్ డిమాండ్ ఉంది.

- మొహమ్మద్ అలీ, షా గౌస్ హోటల్​ నిర్వాహకుడు

బకెట్ బిర్యానీకి కస్టమర్లు  ఫిదా అవుతున్నరు....

బకెట్ బిర్యానీకి కస్టమర్లు ఫిదా అవుతున్నరు. బకెట్ కాన్సెప్ట్‌‌తో ఏడాది క్రితం రెడ్ బకెట్ సెంటర్ ని ఏర్పాటు చేసినం. క్వాలిటీ, క్వాంటిటీతో ఇస్తున్నం. కేవలం పార్సిల్ తీసుకెళ్లేందుకు మాత్రమే ఫెసిలిటీ ఉంది. ప్రస్తుతం సెంటర్ వద్ద డైలీ 250 కిపైగా సేల్ అవుతున్నాయి. ఇవికాకుండా ఫంక్షన్స్ కి ఆర్డర్స్ వస్తున్నయి.

- ప్రకాశ్‌‌, రెడ్ బకెట్ బిర్యానీ నిర్వాహకుడు, ఉప్పల్

వారానికోసారి బావర్చీ పోతం

బిర్యానీ అంటే చాలా ఇష్టం. బావర్చీ బిర్యానీ కోసం ఫ్యామిలీతో స్పెషల్ గా ఇక్కడకు వచ్చి తిని వెళతాం. నేను ఉండేది లింగంపల్లి. కనీసం వారానికోసారైనా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వస్తాను. 15 ఏండ్లుగా ఇక్కడ బిర్యానీ తింటున్న. 

రాజేందర్ గౌడ్