
హనుమకొండ, వెలుగు: ధరణి అందుబాటులోకి వస్తే ఇక ల్యాండ్ఇష్యూస్ అనేవే ఉండవని రాష్ట్ర సర్కారు చెప్పినా, ఫీల్డ్ లెవల్లో భూకబ్జాలు ఆగడం లేదు. వరంగల్ కమిషనరేట్పరిధిలో భూముల రేట్లు కోట్లకు పెరిగిపోవడంతో కొందరు రాజకీయ అండతో, ఇంకొందరు ధరణి లోపాలను ఆసరాగా చేసుకొని భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ల్యాండ్ కబ్జాలపై రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. పోలీస్స్టేషన్లకు వెళ్తే కొందరు పోలీస్అధికారులు అక్రమార్కులకే సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో బాధితులు చివరి ప్రయత్నంగా వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆశ్రయిస్తున్నారు.. ‘సారూ.. మీరే దిక్కు.’ అంటూ న్యాయం కోసం వేడుకుంటున్నారు.. గడిచిన మూడున్నర నెలల్లో పోలీస్‌బాస్‌కు 600కు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే ధరణి ఏ స్థాయిలో ఫెయిల్ అయిందో, ల్యాండ్ మాఫియా ఎలా చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు..
వేలల్లో అక్రమాలు.. ఆఫీసుల చుట్టూ బాధితులు
హైదరాబాద్తర్వాత డెవలప్మెంట్కు అంతటి ఆస్కారం ఉన్న నగరం వరంగల్ కావడంతో ఇక్కడి భూములకు రేట్లు బాగా పెరిగిపోయాయి. దీంతో కొంతమంది పొలిటికల్ సపోర్ట్‌తో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్లో లోపాలను అనుకూలంగా మల్చుకుని అమాయకుల భూములకు ఎసరు పెడుతున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి, మరికొందరు పేరు మోసిన గ్యాంగ్‌ల పేరు చెప్పి, మరికొందరు లీడర్ల పేరు చెప్పి భూదందాలు చేస్తున్నారు. ఈ సందర్భాల్లో బాధితులు తమ భూములను కాపాడుకునేందుకు తహసీల్దార్లతో పాటు కలెక్టరేట్లలో ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఆయా ఆఫీసుల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో అప్లికేషన్లు పెండింగ్‌లో పడిపోయాయి.
స్పెషల్ ఫోకస్ పెట్టిన సీపీ రంగనాథ్
ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో బాధితులు పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నా న్యాయం జరగడం లేదు. లంచాలకు అలవాటు పడిన కొందరు స్టేషన్హౌస్ఆఫీసర్లు అక్రమార్కులకే సపోర్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవి సివిల్ డిస్ప్యూట్ అంటూ తాము జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పి పంపిస్తున్నారు. ఎందుకు గొడవలంటూ కాంప్రమైజ్చేసుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. వినకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పోలీస్‌కమిషనర్‌గా 2022 డిసెంబర్3న బాధ్యతలు తీసుకున్న ఏవీ.రంగనాథ్ఇక్కడి పరిస్థితులను స్టడీ చేశారు. భూ దందాల విషయం తీవ్రం కావడంతో వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫీల్డ్లెవెల్లో న్యాయం జరగడం లేదంటూ తన వద్దకు వచ్చిన కంప్లైంట్స్‌ను ఎంక్వైరీ చేయించి నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారు. కార్పొరేటర్లు, పొలిటికల్ సపోర్ట్ ఉన్న లీడర్లను కూడా లెక్కచేయకుండా కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు నేరుగా సీపీని కలిసి ఫిర్యాదు చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇప్పటికే సీపీ కొంతమంది కబ్జాకోరుల నుంచి భూములను విడిపించి బాధితులకు అప్పగించగా.. న్యాయం పొందిన వారిలో కొందరు సీపీ ఫొటోలకు పాలతో అభిషేకాలు చేశారు. సీపీ బాధ్యతలు తీసుకున్న మూడున్నర నెలల్లోనే 600కు పైగా కంప్లయింట్స్రావడం చూస్తే కమిషనరేట్పరిధిలో భూదందాల సమస్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కార్పొరేటర్లు కూడా లోపలికే..
సీపీ వచ్చిన కొద్దిరోజులకే భూదందాలపై నజర్‌పెట్టారు. జనవరి నెలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన జీడబ్ల్యూఎంసీ ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్, బీఆర్ఎస్ కు చెందిన మరికొందరు నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అక్రమార్కులకు సహకరించారన్న కారణంతో మట్వాడా సీఐ రమేశ్ ను సస్పెండ్ చేశారు. మరికొంతమందిపైనా చర్యలు తీసుకున్నారు. దీంతోనే సీపీ సార్ ను కలిస్తేనే న్యాయం జరుగుతుందనే భావన బాధితుల్లో నెలకొంది. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో సగటున 80 అప్లికేషన్లు వస్తుండగా..ఇందులో సగానికిపైగా భూసమస్యలే ఉంటున్నాయి. రోజువారీగా వస్తున్న దరఖాస్తులు వీటికి అదనం. ఫీల్డ్లెవెల్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికీ అక్రమార్కులకు సహకరిస్తుండటంతో మూడు రోజుల కిందట సీపీ మీటింగ్‌పెట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. బాధితులకు న్యాయం జరిగేలా పని చేస్తే వందల మంది తన ఆఫీసుకు ఎందుకు క్యూ కడతారని నిలదీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో పని తీరు మార్చుకోవాలని, లేదంటే యాక్షన్ తప్పదని కొందరు ఆఫీసర్లను మందలించినట్లు తెలిసింది.