దారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులు.. 100 మందిని కాల్చి చంపేశారు !

దారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులు.. 100 మందిని కాల్చి చంపేశారు !

బుర్కినా ఫాసో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ గ్రూప్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 100 మందిని పొట్టనపెట్టుకున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సైనికులే కావడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2.3 కోట్ల జనాభా నివసిస్తున్న  బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు జిబో పట్టణాన్ని టార్గెట్ చేసుకుని ఈ దారుణానికి తెగబడ్డారు.

మిలటరీ బేస్పై కాల్పులు జరిపారు. సైనికులు తేరుకుని కౌంటర్ అటాక్ చేసే లోపే ప్రాణ నష్టం జరిగిపోయింది. అల్-ఖైదాకు చెందిన JNIM ఉగ్రవాదులు ఈ మారణహోమం తమ పనేనని ధృవీకరించారు. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో ఈ JNIM యాక్టివ్గా ఉంది. బుర్కినా ఫాసోలో ప్రభుత్వం మిలటరీ జుంటా నేతృత్వంలో పాలన సాగిస్తోంది. అల్ ఖైదా గ్రూప్ ఉగ్రవాదులు బుర్కినా ఫాసోలో దశాబ్ద కాలంగా కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సైన్యం ఈ దాడులను తిప్పి కొట్టింది. తాజాగా.. జిబో పట్టణంలోని పలు ప్రాంతంలో ఏక కాలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

పోలీస్ పోస్టులు, మిలటరీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని నరమేధం సృష్టించారు. మోటార్ సైకిల్స్పై ఉగ్రవాదులు జిబో పట్టణంలోకి ఎంటర్ అయినట్లు సెక్యూరిటీ వర్గాల సమాచారం. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు ఆరంభించిన ఉగ్రవాదులు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిబో పట్టణంలోనే ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నవంబర్ 2023లో జిబో పట్టణం ఖాళీ చేసి వెళ్లిపోవాలని జిహాదీలు అల్టిమేటం జారీ చేయడంతో చాలా మంది స్థానికులు ప్రాణ భయంతో ఆ పట్టణం నుంచి వెళ్లిపోయారు. తమ హెచ్చరికను పట్టించుకోకుండా అక్కడే ఉన్న వారిలో 40 మంది పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపేశారు.