తిరుమల ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దగ్గర చిరుత : గుంపులుగా వెళ్లాలంటున్న అధికారులు

తిరుమల ఘాట్ రోడ్డులో వినాయకుడి గుడి దగ్గర చిరుత : గుంపులుగా వెళ్లాలంటున్న అధికారులు

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి సమీపంలో  రోడ్డు దాటుతూ కనిపించిందని ద్విచక్ర వాహనదారులు చెప్పారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

భక్తుల ఫిర్యాదుతో రెండవ ఘాట్ రోడ్డుకు చేరుకున్న అధికారులు చిరుత జాడలను పరిశీలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా, చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుత విషయంపై భక్తులకు అప్రమత్తత చేస్తున్నారు అధికారులు. నడకదారిలో కొండకు వెళ్లే భక్తులు.. గుంపులుగా వెళ్లాలని.. ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు. 

తిరుమలలో చిరుత సంచారం తరచుగా జరుగుతూనే ఉంది. తిరుపతి నుండి తిరుమలకు వెలుతున్న రెండవ ఘాట్ లో తరచూ సంచరిస్తు భక్తులకు కనిపిస్తోంది. ఇటీవల వెటర్నరీ కళాశాలలో బోనులో చిరుత చిక్కడంతో సమస్య తీరిపోయింది అనుకున్నారు. కానీ మళ్లీ మళ్లీ కనిపిస్తుండటం భక్తులను భయాందోళనలకు గురి చేస్తోంది. చిరుత తిరుగుతుండటంతో రాత్రి వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచించారు.