
ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఈ సారి యంగ్ టీమిండియా బయలుదేరుతుంది. జూన్ 20 న ప్రారంభం కాబోయే ఈ మెగా సిరీస్ కు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు భారత్ అనుభవం లేమితోనే ఇంగ్లాండ్ వెళ్లనుంది. అంతకముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత అశ్విన్ కూడా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే ఇప్పుడు టెస్ట్ జట్టుకు కెప్టెన్ ఎవరనేది సెలక్టర్ల ముందున్న పెద్ద సవాలు. ఇప్పటికే బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీని తిరస్కరించడంతో జట్టును ఎవరు నడిపించగలరనే ప్రశ్న పెద్ద తలనొప్పిగా మారింది. ఈ రేస్ లో శుభమాన్ గిల్, పంత్, రాహుల్ ఉన్నప్పటికీ వారికి కెప్టెన్సీ అనుభవం లేదు.
గిల్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో కెప్టెన్సీ చేయలేదు. విదేశాల్లో అతని ఫామ్ కూడా ఏమంత బాగాలేదు. కేవలం 25 యావరేజ్ తో పరుగులు చేశాడు. ఇక పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. రాహుల్ వయసు 33 సంవత్సరాలు. అతను సుదీర్ఘ కాలంగా టెస్ట్ కెప్టెన్సీ చేయలేడు. అంతేకాదు కాదు రాహుల్ కి టెస్ట్ కెప్టెన్సీ అనుభవం లేదు. ఈ ముగ్గురు ఐపీఎల్ లో తమ జట్లకు కెప్టెన్సీ చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ సమయంలో సెలక్టర్లు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
రహానే జట్టులో ఉంటే అంతా సెట్ అయ్యేలా కనిపిస్తుంది. రహానేకు 85 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. గతంలో కోహ్లీ కెప్టెన్ గా ఉన్నపుడు వైస్ కెప్టెన్ గా జట్టును నడిపించాడు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాకు ఆస్ట్రేలియాలోని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిపించాడు. ఈ ముంబై బ్యాటర్ గతంలో మూడు సార్లు ఇంగ్లాండ్ లో పర్యటించిన అనుభవం ఉంది. రహానే అనుభవం కావాలనుకుంటే సెలక్టర్లు అతన్ని ఎంపిక చేసి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు లేకపోలేవు.
జాతీయ జట్టుకు దూరమైన రహానే.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 45.76 సగటుతో 13,000కిపైగా పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 39.72 సగటుతో 6475 పరుగులు చేశాడు. రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.