జ్యోతిష్యం : 12 ఏళ్ల తర్వాత మిథునం, కర్కాటక రాశుల్లోకి గురువు.. చాలా చాలా మార్పులు.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి..?

జ్యోతిష్యం : 12 ఏళ్ల తర్వాత మిథునం, కర్కాటక రాశుల్లోకి గురువు.. చాలా చాలా మార్పులు.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి..?

దేవతలకు గురువైన గురుడు  సంపదను, శ్రేయస్సును, వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. జీవితాన్ని సరైన దారిలో నడిపించి మంచి స్థాయికి చేరుకునేలా చూసుకుంటాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న గురుడు   మే 14వ తేదీన మిథునరాశిలోకి గురువు ప్రవేశిస్తాడు.  ఆ తరువాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.  అక్టోబర్ 18 వరకు  గురుడు ఈ రాశులలో  సంచరిస్తాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ   నాలుగు రాశుల ( తుల,  సింహం, కుంభం, మీన) వారికి బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .

మేషరాశి: ఈ రాశి వారికి ...  గురుడు మిథునరాశి  మరియు కర్కాటక రాశి లో  సంచారం వలన కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కష్టపడతారు కాని శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు.  సహోద్యోగులు.. తోటి వారి పట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.  గతంలో మీనుంచి సాయం పొందిన వారు.. ఇప్పుడు ముఖం చాటేస్తారు.  ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి పరిస్థితులు నెలకొంటాయి.  ఖర్చులు అధికమవుతాయి.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  

వృషభరాశి :  ఈ రాశి వారికి అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి.  పెండింగ్​ పనులు పూర్తికావడంతో సంతోషంగా గడుపుతాయి.  ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలుంటాయి.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్​ వచ్చే అవకాశంతో పాటు.. కొద్దిగా వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

Also Read : రోజూ టీ స్పూన్ గుమ్మడి గింజలు తింటే.. మీ బాడీలో జరిగే మార్పులు ఇవే..!

మిథునరాశి:  ఈ రాశి  వారికి  వైవాహిక జీవితంలో  సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.  చేసే పనుల్లో ఆటంకంతో పాటు పురోభివృద్ది ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు.  అయితే ఆర్థిక పరంగా కొద్దిపాటి చిక్కులు ఉన్నా.. సకాలంలో చేతికి డబ్బు అందుతుంది.  డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి.  ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి.  జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 

కర్కాటకరాశి : మిథునరాశి, కర్కాటక రాశుల్లో  గురుడు సంచారం వలన ఈ  రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.  ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలె తీసుకోవాలి.  ఆస్తి సమస్యలు.. కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని జ్యోతిష్య   పండితులు సూచిస్తున్నారు.  ఈ రాశి వారికి క్షణం తీరిక లేదు.. పైసా ఆదాయం లేదు అన్న విధంగా ఉంటుంది.  ప్రతి పనిలో జరిగే ఆలస్యం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.  దైవ చింతన చేస్తూ అనుకున్న పనులను మీ షెడ్యూల్​ ప్రకారం చేయండి.   ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి. 

సింహరాశి:  ఈ రాశికి గురుడు స్థాన చలనం అన్ని విధాలా కలసి వస్తుంది.  కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ బేధాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.  డబ్బులావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభం వస్తుంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​వింటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  ఇక ఉద్యోగస్తుల విషయంలో  స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్​లు  చేపట్టడం .. కొద్దిపాటి మేరకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుపుతారు. 

కన్యారాశి:  గురుడు స్థాన  చలనం ఈ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పని పూర్త్యే అవకాశం ఉంది.  కెరీర్​ విషయంలో సానుకూల మార్పులు జరుగుతాయి.  ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

తులారాశి:  మిథున రాశి.. కర్కాటక రాశుల్లో  గురుడు సంచారం వలన  ఈ రాశి వారికి అదృష్టం కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  చేపట్టిన పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతున్నారు.  ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం.. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి.  అధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి.  కార్యాలయంలో మీరు చక్రం తిప్పే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అధిక లాభాలుంటాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి :  ఈ రాశి వారు చేపట్టే కొత్త పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  పనిభారం అధికమవుతుంది.  ఆర్థిక విషయాల్లో మిత్రులు మోసగించే అవకాశం ఉంది.  రావలసిన డబ్బు కొద్దిగా మాత్రమే చేతికందుతుంది.  వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఇతరులతో మాట్లడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి.  ప్రతి పని కూడా కష్టపడితే గాని  పూర్తి కాదు.  ఆస్తివివాదాలు.. కోర్టు కేసుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

ధనస్సురాశి : మిథునం.. కర్కాటకంలో  గురుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  కొన్నిరంగాల్లో పని చేసే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనులు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రియల్​ఎస్టేట్​ రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోకుండా అప్పులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. ప్రతి పని కూడా అతి కష్టం మీద పూర్తవుతుంది. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ముందుకుసాగండి.. చివరిలో అంతా మంచే జరుగుతుంది. 

మకరరాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.  కొత్త  వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఆర్థిక సమస్యలు పెరగడంతో  అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  బంధువులతోనూ.. స్నేహితులతోనూ చిన్న చిన్న విషయాలకూ మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.. వ్యాపారస్తులు ఏ మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది. 

కుంభరాశి:   గురుడు స్థాన చలనం  కారణంగా ఈ రాశి వారి కెరీర్​ లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.  సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు పెరుగుతాయి.  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని విషయంలో శుభవార్త వింటారు.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  అయితే ఒక్కోసారి ఆందోళనకర వాతావరణం ఉంటుంది.  అధైర్య పడకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి.. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు అంచనాకు మించి లాభాలొస్తాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మీనరాశి:  ఈ రాశి వారికి మిథునరాశి.. కర్కాటక రాశుల్లో  గురుడు సంచరించడం వలన చాలా లాభదాయంగా ఉంటుంది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు లాభాలతో పాటు... బిజినెస్​ ను విస్తరించే అవకాశం ఉంటుంది.  కొత్త పనులు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాశంగా పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.