
బాల్కొండ, వెలుగు: భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టింటి ముత్యం రెడ్డి తెలిపారు. సోమవారం వెన్నెల్(బి)లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. భాస్వరం ఎరువులను దుక్కి లో మాత్రమే వేసుకోవాలని, అవసరం మేరకు రసాయనాలను వినియోగించాలని సూచించారు. విత్తనాలు మొలకెత్తకపోయినా, పురుగుమందు పని చేయకపోతే, రశీదుతో వినియోగదారులు కోర్టులో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
సాగు నీటిని ఆదా చేసి, భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. వరి పంటలో తడి పొడి విధానంతో నీటి యాజమాన్యం చేసినట్లయితే 15 నుంచి 30% నీటిని ఆదా చేయవచ్చని వివరించారు. మొక్కజొన్న సాగులో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వరుస విడిచి వరుస పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో కృష్ణ చైతన్య, సాయి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి బి లావణ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిహారిక, రేష్మ, డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వినాయక్, గ్రామ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు .