
ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారుల అంతు చూస్తున్నారు. లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ సోదాలు చేసింది. అయితే అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే లంచం కేసులో బుక్కవడం.. అందులో డీఎస్పీ, సీఐ వంటి ఉన్నత స్థాయి అధికారులు లంచాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు డీఎస్పీని, సీఐని అదుపులోకి తీసుకోవడం సూర్యపేట జిల్లాలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలో డీఎస్పీని, సీఐని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం (మే 12) సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి తనిఖీలు నిర్వహించారు. ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్స్ నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు డీఎస్పీ పార్థసారథి, సీఐ వీర రాఘవులు.
బాధితుడు ఏసీబీ కి ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. డీఎస్పీ , సీఐ ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.. వారి ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేసినా నేరమేనని ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ అన్నారు.