సమస్యల్లో మోడల్ స్కూళ్లు .. 194 స్కూళ్లలో వెయ్యికి పైగా టీచర్ పోస్టులు ఖాళీ

సమస్యల్లో మోడల్ స్కూళ్లు .. 194 స్కూళ్లలో వెయ్యికి పైగా టీచర్ పోస్టులు ఖాళీ
  • 90 స్కూళ్లలో ఇన్​చార్జి ప్రిన్సిపాల్స్, హెచ్​బీటీలతో బోధన 
  • పదకొండేండ్లుగా ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేక టీచర్ల అవస్థలు 
  • డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి ఆందోళనబాట

మంచిర్యాల, వెలుగు: అవి పేరుకే మోడల్ (ఆదర్శ)​ స్కూళ్లు కానీ అన్నీ సమస్యలే. సరిపడా టీచర్లు లేరు. ఉన్నవారికి 11 ఏండ్లుగా ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేవు. ఖాళీ పోస్టుల రిక్రూట్మెంట్​ లేదు. 90కి పైగా స్కూళ్లలో ఇన్​చార్జి ప్రిన్సిపాల్సే ఉన్నారు. 50కి పైగా స్కూళ్లలో హవర్లీ బేస్డ్​ టీచర్స్​(హెచ్​బీటీలు)తో విద్యాబోధన సాగిస్తున్నారు. జూనియర్ ​లెక్చరర్ల నియామకం చేపట్టకపోవడంతో పీజీటీలతోనే ఇంటర్​ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. హాస్టళ్ల మెయింటనెన్స్​ను కస్తూర్బా (కేజీబీవీ) స్పెషల్​ ఆఫీసర్లకు అప్పగించారు.

ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న మోడల్​స్కూళ్లను గత బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోలేదు. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ​ప్రభుత్వమైనా మోడల్​స్కూళ్లను గాడిలో పెట్టాలని టీచర్లు కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి ఆందోళనకు దిగనున్నారు. సర్కారు స్పందించకపోతే ఈ నెల 29న డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ ఆఫీస్​ ముట్టడించాలని నిర్ణయించుకున్నారు.  

గాలికి వదిలేసిన బీఆర్ఎస్​ సర్కారు 

తెలంగాణ వ్యాప్తంగా 194 మోడల్​ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 3,800 టీచర్​ పోస్టులకు ఉమ్మడి రాష్ర్టంలో 2013 జూన్​లో అప్పటి కాంగ్రెస్​  ప్రభుత్వం 2,800 పోస్టులను రిక్రూట్​చేసింది. ఇందులో ట్రెయిన్డ్ ​గ్రాడ్యుయేట్​టీచర్స్​ (టీజీటీ), పోస్ట్​ గ్రాడ్యుయేట్​ టీచర్స్​ (పీజీటీ)లను భర్తీ చేసింది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ మోడల్​ స్కూళ్లను గాలికి వదిలేసింది. వెయ్యికి పైగా ఖాళీ పోస్టుల్లో హవర్లీ బేస్డ్​ టీచర్స్​(హెచ్​బీటీ)ను నియమించింది. అప్పటినుంచి ఇప్పటివరకు మోడల్​ స్కూళ్లలో టీచర్ల రిక్రూట్​మెంటే జరగ లేదు. ఇటీవల కాంగ్రెస్​ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోడల్​ స్కూల్​ టీచర్ల రిక్రూట్​మెంట్​ లేకపోవడంతో మళ్లీ హెచ్​బీటీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.  

2013 నుంచీ ఒకే చోట...

11 ఏండ్లుగా ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేకపోవడంతో మోడల్​ స్కూల్​ టీచర్లు తిప్పలు పడుతున్నారు. 2013లో అపాయింట్​మెంట్​అయిన చోటనే నేటికీ పనిచేస్తున్నారు. 2016లో జిల్లాలు బైఫర్​కేషన్​ కావడంతో పిల్లల చదువులు, స్థానికత విషయంలో కొత్త సమస్యలు వచ్చాయి. ఉదాహరణకు...నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంచిర్యాల జిల్లా పరిధిలోని ఓ స్కూల్​లో పనిచేస్తున్నారు. ఆయన పిల్లలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగు క్లాస్​లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లానే వారికి లోకల్​ అవుతుంది. మరోవైపు నిర్మల్ ​జిల్లా బాసర జోన్​లోకి వెళ్లగా, మంచిర్యాల జిల్లా కాళేశ్వరం జోన్​ పరిధిలో ఉంది. ఇలా సొంత జిల్లా ఒక జోన్​, లోకల్​ జిల్లా మరో జోన్​ అవుతుంది. దీంతో భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో సమస్యలు వస్తాయంటున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్​ఫర్లు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, జేఎల్​​ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు.  

డిమాండ్లు ఇవే..

వెంటనే ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు చేపట్టాలని, 010 మద్దు ద్వారా జీతాలు చెల్లించాలని టీచర్లు డిమాండ్​చేస్తున్నారు. అలాగే హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని,  హిందీ పీజీటీ పోస్టులను ఏర్పాటు చేయాలని, పీజీటీలకు జూనియర్​ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటున్నారు. ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ ఖాళీలను భర్తీ చేయాల్సిందేనంటున్నారు.

ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24న నల్లబ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. 25, 26 తేదీల్లో మధ్యాహ్నభోజనం విరామ సమయంలో నిరసనలు చేపట్టడం, సీఎంవో, విద్యాశాఖ కార్యదర్శికి సోషల్​ మీడియా ప్లాట్​ఫాం ఎక్స్​లో పోస్టులు చేయడం. 27న తహసీల్దార్, ఎంఈవోలకు మెమోరాండం ఇవ్వడం, 28న కలెక్టర్​, డీఈవో ఆ ఫీసుల ఎదుట, 29న డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు.  

ఇన్​చార్జీలతోనే నెట్టుకొస్తున్నరు...

రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 90 మోడల్​ స్కూళ్లలో రెగ్యులర్​ ప్రిన్సిపాల్స్​ లేరు. దీంతో టీజీటీ, పీజీటీలకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించి నడిపిస్తున్నారు. 50 స్కూళ్లలో రెగ్యులర్​ టీచర్లు లేకపోవడంతో హెచ్​బీటీలతో నెట్టుకొస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, కోటపల్లి, కాసిపేటలో 
ఇదే పరిస్థితి నెలకొంది. మందమర్రి, దండేపల్లి మండలం లింగాపూర్​ స్కూళ్లలో మాత్రమే టీజీటీ, పీజీటీలున్నారు. మోడల్​ స్కూళ్లలో ఇంటర్​మీడియట్​ బోధించడానికి జూనియర్​ లెక్చరర్లను రిక్రూట్​చేయలేదు.

9,10  క్లాస్​లకు టీచింగ్​ చేసే పీజీటీలతోనే ఇంటర్​ క్లాస్​లు చెప్పిస్తున్నారు. దీంతో ఇంటర్​లో ఆశించిన ఫలితాలు రావడం లేదంటున్నారు. అలాగే ఇంటర్​ గర్ల్స్​కోసం మోడల్ ​స్కూళ్లలో హాస్టల్స్​ ఏర్పాటు చేశారు. ఏండ్లు గడుస్తున్నా కొన్ని చోట్ల హాస్టళ్లను ప్రారంభించకపోవడం వల్ల బాలికలు డే స్కాలర్స్​గా చదువుకుంటున్నారు.ఊళ్లకు దూరంగా ఉన్న స్కూళ్లకు వచ్చిపోవడానికి సరైన రవాణా సౌకర్యాలు అవస్థలు పడుతున్నారు. హాస్టళ్ల మెయింటనెన్స్​ను కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్లకు అప్పగించడం వల్ల పర్యవేక్షణ కొరవడింది.