రష్యా వార్‌పై భారత వైఖరిని ప్రకటించిన కేంద్ర మంత్రి

రష్యా వార్‌పై భారత వైఖరిని ప్రకటించిన కేంద్ర మంత్రి

ప్రపంచ దేశాల ఒత్తిడిని లెక్క చేయకుండా రష్యా రాత్రికి రాత్రి ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. మూడు వైపుల నుంచి రష్యన్ బలగాలు చుట్టుముట్టి దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులపై ఉక్రెయిన్ కౌంటర్ అటాక్ కు దిగింది. తాము రష్యాను ఎదుర్కొని గెలుస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా చెప్పారు. అయితే ప్రపంచ దేశాలు కూడా తమకు సాయం చేయాలని, యుద్ధ సామాగ్రితో పాటు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. అలాగే రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాలని, ఆ దేశ దురాక్రమణను నిలువరించాలని ప్రపంచ దేశాలను రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సహా పలు నాటో దేశాలు.. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించాయి. చైనా మాత్రం రష్యాకు సపోర్ట్ చేస్తోంది.  అయితే ఈ యుద్ధంలో భారత్ స్టాండ్ ఏంటి? ఏ దేశం వైపు నిలుస్తుందన్న ప్రశ్న అందరికీ తలెత్తుతోంది. దీనిపై భాతర విదేశాంగ శాఖ ఇవాళ మధ్యాహ్నం స్పందించింది. ఈ యుద్ధం విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని వెల్లడించింది.


ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అన్నారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని, శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ క్రైసిస్ విషయంలో భారత్ తటస్థ వైఖరిని ఎంచుకుందని, ఏ దేశం వైపూ మొగ్గు చూపబోదని స్పష్టం చేశారు. ఆ రెండు దేశాలు శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరారు.