అమెరికా రిపోర్ట్ : మన టూరిస్టులే ఎక్కువ

అమెరికా రిపోర్ట్ : మన టూరిస్టులే ఎక్కువ

వచ్చే ఐదేళ్లలో 37 శాతం పెరుగుదల.. మనమే టాప్
ప్రస్తుతం 14.3 లక్షలు..
2024 నాటికి 18.8 లక్షలు
అమెరికాకు వెళ్లే టూరిస్టులపై
ఆ దేశ వాణిజ్య శాఖ రిపోర్టు
ప్రస్తుతం ఇండియా స్థానం 10.. టాప్​లో కెనడా

చదువు కోసమో, ఉద్యోగం కోసమో మనోళ్లు అమెరికా బాట పడుతుంటారు. అక్కడికి వెళుతున్న వాళ్లలో చైనా తర్వాతి స్థానం మనోళ్లదే. చదువు, ఉద్యోగాలే కాదు, ఆ దేశాన్ని చూడ్డానికి వెళ్లే టూరిస్టుల్లోనూ మనోళ్లే ఎక్కువవుతారట. వచ్చే ఐదేళ్లలో అమెరికాకు వెళ్లే ఇండియన్​ టూరిస్టుల సంఖ్య భారీగా పెరుగుతుందట. అమెరికాకు వెళ్లే విదేశీ టూరిస్టుల సంఖ్యపై అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ రిపోర్టును విడుదల చేసింది. దాని ప్రకారం గత ఏడాది 13.8 లక్షల మంది ఇండియన్లు అమెరికా టూర్​కు వెళ్లారు. 2019లో ఆ సంఖ్య 14.3 లక్షలకు పెరిగింది. 2024 నాటికి ఇండియన్​ టూరిస్టుల సంఖ్య 18.8 లక్షలకు పెరిగి, ఇండియా టాప్​లో నిలుస్తుందని అమెరికా చెప్పింది. ఈ ఐదేళ్ల కాలంలో 37 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఏడాది లెక్కన (కాంపౌండెడ్​ యాన్యువల్​ గ్రోత్​ రేట్​– సీఏజీఆర్​) తీసుకుంటే ఏటా 5 శాతం చొప్పున ఇండియన్​ టూరిస్టులు పెరుగుతారని తెలిపింది. అమెరికాకు ఎక్కువగా టూరిస్టులు వచ్చే 21 దేశాల జాబితాలో ఇండియా నుంచి వచ్చే వారి వృద్ధి రేటే ఎక్కువని చెప్పింది. ప్రస్తుతం అమెరికాకు వెళ్లే టూరిస్టుల సంఖ్యలో ఇండియా 10వ స్థానంలో ఉంది.

21 దేశాల వృద్ధి 13.7%

21 దేశాల నుంచి అమెరికాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 13.7 శాతం పెరుగుతుందని అమెరికా వాణిజ్య శాఖ రిపోర్టు వెల్లడించింది. సీఏజీఆర్​ ప్రకారమైతే ఆ వృద్ధి 2.2 శాతంగా ఉంటుందని తెలిపింది. 2019లో ఆ 21 దేశాల నుంచి 7.9 కోట్ల మంది టూరిస్టులు అమెరికా వచ్చారని, 2024 నాటికి 10.9 కోట్లకు ఆ సంఖ్య చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారని తెలిపింది. ఈ జాబితాలో కెనడా టాప్​ ప్లేస్​లో ఉండగా, మెక్సికో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇతర దేశాల జాబితాలో బ్రిటన్​, జపాన్​, చైనా టాప్​ 3 స్థానాల్లో ఉన్నాయి. సరిహద్దు దేశాలు, ఇతర విదేశాలు అన్నింటిని కలుపుకుంటే అమెరికా వెళుతున్న టూరిస్టుల సంఖ్యలో ఇండియా పదో స్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇండియా టూరిస్టుల వృద్ధి 37 శాతంగా ఉంటే, ఆ తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్​ (25%), చైనా (18%) ఉంటాయని అమెరికా వాణిజ్య శాఖ అంచనా వేసింది.

 ఫ్లైట్​ చార్జీలు, ట్రావెల్​ ప్యాకేజీలు

ప్రస్తుతం ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయి. అదే అమెరికాకు వెళ్లే ఇండియన్​ టూరిస్టుల సంఖ్య పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘కొన్నేళ్లుగా చాలా మంది ఇండియన్లు అమెరికాకు జాలీ ట్రిప్పులు వేస్తున్నారు. ట్రావెల్​ ప్యాకేజీలు, విమాన చార్జీలు అందుబాటులో ఉండడంతో తరచూ వెళుతున్నారు. మిలీనియల్స్​ అయితే ట్రావెలింగ్​పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆ జాలీ ట్రిప్పుల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటామన్న ఆశతోనే అమెరికాకు వెళుతున్నారు” అని యాత్రా అనే ట్రావెల్​ పోర్టల్​ సీవోవో శరత్​ ధళ్​ తెలిపారు. ‘‘అంతేగాకుండా అమెరికాకు చెందిన చాలా టూరిస్టు కంపెనీలు ఇండియాలో ఆఫీసులు పెట్టాయి. ప్రస్తుతం ఇండియా–అమెరికా మధ్య బిజినెస్​ ట్రిప్పులు ఎప్పుడూ లేనంత ఎక్కువయ్యాయి. చదువు కోసం వెళ్లే స్టూడెంట్లను లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది” అని ఆయన చెప్పారు.

డైరెక్ట్‌ ఫ్లైట్లు తక్కువ

ప్రస్తుతం ఇండియా– అమెరికా మధ్య నడుస్తున్న డైలీ ఫ్లైట్లు చాలా తక్కువ. కేవలం ఎయిర్​ ఇండియా, యునైటెడ్​ మాత్రమే రెండు దేశాల మధ్య డైరెక్ట్​ ఫ్లైట్లు నడుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి న్యూయార్క్​, షికాగో, శాన్​ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్​లకు ఎయిర్​ ఇండియానే రోజూ ఎక్కువ డైరెక్ట్​ ఫ్లైట్లను తిప్పుతోంది. నెవార్క్​ నుంచి ఢిల్లీ, ముంబైలకు యునైటెడ్​ విమానాలను నడుపుతోంది. డిసెంబర్​ 5 నుంచి శాన్​ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి నాన్​స్టాప్​ ఫ్లైట్లు నడపాలని యునైటెడ్​ నిర్ణయించింది. డిసెంబర్​ 22 నుంచి అమెరికాకు చెందిన డెల్టా కంపెనీ ముంబై నుంచి న్యూయార్క్​కు విమానాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

2006 నుంచి 2009 వరకు ఆ సంస్థ విమానాలను నడిపింది. కేవలం ఈ సంస్థలే విమానాలను నడిపితే సరిపోదని, మరిన్ని సంస్థలు అమెరికా–ఇండియా మధ్య విమానాలను నడిపాల్సిన అవసరం ఉందని కొందరు ట్రావెల్​ ఏజెంట్లు చెబుతున్నారు. ఎయిర్​ ఇండియా భవిష్యత్​ ప్రస్తుతం గందరగోళంలో పడిన నేపథ్యంలో, ఇతర ప్రైవేట్​ ఆపరేటర్లు రోజువారీ డైరెక్ట్​ ఫ్లైట్లకు ప్లాన్​ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.