- రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం
- ఈ నెల 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఎన్డీడీబీ
- రైతుల పాల బిల్లులకు
- రూ.10 కోట్లు చెల్లింపుబ్యాంకు అప్పు కూడా తీర్చేందుకు అంగీకారం
- పాల సేకరణ మదర్ డెయిరీ, మార్కెటింగ్ ఎన్డీడీబీ చేపట్టేలా నిర్ణయం
యాదాద్రి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ), నార్ముల్(మదర్ డెయిరీ) మధ్య ఒప్పందం కుదిరింది. మదర్ డెయిరీని టేకోవర్ చేసిన ఎన్‌డీడీబీ రైతులకు చెల్లించాల్సిన పాల బకాయిలతో పాటు బ్యాంకు అప్పులను కూడా తీర్చేందుకు ముందుకొచ్చింది. ఉమ్మడి నల్గొండ–రంగారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నార్ముల్(మదర్ డెయిరీ)కు మొత్తం 311 సొసైటీలు ఉన్నాయి. ఒకప్పుడు విస్తృతంగా పాల వ్యాపారం సాగించిన ఈ డెయిరీ ఇటీవల భారీ నష్టాల్లోకి వెళ్లింది. ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లు పెరిగిపోవడంతో రైతులకు పాల బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా రూ.70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.
]దీంతో బ్యాంకులు ఒత్తిడి పెంచాయి. బిల్లులు రాక రైతులు ప్రైవేట్ డెయిరీలకు మారిపోయారు. ఈ నేపథ్యంలో డెయిరీని గట్టెక్కించేందుకు చైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పలుమార్లు గుజరాత్ వెళ్లి ఎన్‌డీడీబీ చైర్మన్ మనీశ్ షాను కలిశారు. అనంతరం మనీశ్ షా హైదరాబాద్‌లో సీఎంను కలవడంతో మదర్ డెయిరీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో డెయిరీని ఎన్‌డీడీబీ టేకోవర్ చేసింది.
ఒప్పందాలివే..
ఎన్‌డీడీబీ, నార్ముల్(మదర్ డెయిరీ) మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం డెయిరీ నిర్వహణ 15 సంవత్సరాలు ఎన్‌డీడీబీ ఆధీనంలో ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు, బ్యాంకు అప్పులు కలిపి రూ.70 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. రైతుల నుంచి పాల సేకరణ బాధ్యత మదర్ డెయిరీదే కాగా, ప్రాసెసింగ్‌తో పాటు పాల ఉత్పత్తుల నిర్వహణను ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలోని ఢిల్లీ మదర్ డెయిరీ చూసుకుంటుంది.
సేకరించిన ప్రతి లీటర్ పాలకు మదర్‌డెయిరీకి రూ.6.50 కమీషన్ ఇవ్వనుంది. అదనంగా ఏటా రూ.5 కోట్ల గుడ్‌విల్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, ఎన్‌డీడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు.
పలువురికి వీఆర్‌ఎస్..
గత పాలకవర్గాలు అవసరానికి మించి నియామకాలు చేయడంతో డెయిరీలో ఉద్యోగుల సంఖ్య 430కు చేరింది. వారిని శాశ్వతం చేయడంతో ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రస్తుతం రోజుకు కేవలం 23 వేల లీటర్ల పాల సేకరణ మాత్రమే జరుగుతోంది. దీనికి ఎన్‌డీడీబీ ఇస్తున్న కమీషన్ జీతాలకు సరిపోవడం లేదు. అందువల్ల పాల సేకరణను కనీసం లక్ష లీటర్లకు పెంచితేనే భారం తగ్గుతుందని పాలకవర్గం భావిస్తోంది. కొందరికి వీఆర్‌ఎస్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉంది.
పాల బిల్లుల చెల్లింపు షురూ..
పాడి రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో భాగంగా ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలోని మదర్ డెయిరీ మంగళవారం రూ.10 కోట్ల చెక్కును చెల్లించింది. అలాగే బ్యాంకు అప్పుల్లో రూ.27 కోట్లు చెల్లించేందుకు మార్గం సుగమం చేసింది. మిగిలిన మొత్తం ఈ నెలాఖరులోగా చెల్లించనుంది. రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి రానుంది. ఈ నెల 15 వరకు మదర్‌డెయిరీ ఆధ్వర్యంలో డెయిరీ కొనసాగగా, 16 నుంచి ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలోని మదర్ డెయిరీ(ఢిల్లీ) కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
ఒప్పందంతో రైతులకు మేలు
పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్డీడీబీ, మదర్ డెయిరీ మధ్య కుదిరిన ఒప్పందం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులకు సమయానికి బిల్లులు చెల్లించడం, పాల సేకరణను పెంచడం, ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా పాడి రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం.
- బీర్ల అయిలయ్య,
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
