గచ్చిబౌలి, వెలుగు : ఆటిజం, మాటలు రాక ఇబ్బంది పడుతున్న తన ఆరేండ్ల కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. తాను నివాసం ఉంటున్న భవనం 12వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అన్మోల్ కుమార్, అపర్ణ అన్మోల్ దంపతులకు ఆరేండ్ల కుమార్తె ఉంది. వీరు కొండాపూర్ మసీద్ బండలోని 'ఎస్ఎంఆర్ వినయ్ ఐకోనియా' అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
అన్మోల్ కుమార్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె పుట్టినప్పటి నుంచి ఆటిజం సమస్యతో బాధపడుతోంది. దీనికి తోడు మాటలు కూడా రాకపోవడంతో, కుమార్తె భవిష్యత్తును తలచుకుని తల్లి అపర్ణ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అపర్ణ.. తాను ఉంటున్న బిల్డింగ్ 12వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
