తల్లీ నీకు వందనం : బిడ్డ కోసం ప్రాణాలకు తెగించి.. పులితో పోరాడిన అమ్మ

తల్లీ నీకు వందనం : బిడ్డ కోసం ప్రాణాలకు తెగించి.. పులితో పోరాడిన అమ్మ

బిడ్డను కాపాడుకోవడానికి తల్లులు చేసే సాహసం ముందు ఏదీ సాటి రాదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా బిడ్డను కాపాడుకోవడం ఒక్కటే తల్లికి తెలుసు. అలాంటి ఒక తల్లి ధైర్యానికి నిదర్శనమే ఈ సంఘటన. తన బిడ్డ పులికి చిక్కినా భయపడకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా పులికే ఎదురు తిరిగింది ఈ తల్లి. 

మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఝరియా దట్టమైన అడవుల మధ్య ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన కిరణ్ బైగాకు ముగ్గురు పిల్లలు. ఆమె ఒక రోజు పిల్లలతో కలిసి ఇంటి దగ్గర చలి మంట కాచుకుంటుంది. కిరణ్ ఒడిలో ఓ చిన్నారి ఉండగా, పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఒక చిరుతపులి వాళ్లమీద దాడి చేసి పిల్లవాడ్ని లాక్కెళ్లిపోయింది. 

దాంతో తల్లి ప్రాణం తల్లడిల్లింది. చిరుతపులి చీకట్లో ఎటు వెళ్తుందో తెలియలేదు. అయినా అదే పులి వెనుక కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. కిరణ్. పులి నోట్లో ఉన్న బిడ్డను చూసిన తల్లికి నోట మాట రాలేదు. కొడుకు తల మొత్తం ఆ చిరుత పులి నోట్లో ఉంది. అది చూసి మొదట్లో భయపడింది. కానీ, బిడ్డ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. 

ధైర్యం తెచ్చుకుని దాదాపు కిలోమీటర్ వరకూ చిరుతపులిని వెంబడించింది. చిరుత ఆమె మీద కూడా దాడి చేసింది. అయినా వెనక్కి తగ్గలేదు. చివరకు తల్లి చేసిన తీవ్ర ప్రయత్నం తర్వాత పులి ఆ బాబును వదిలేసి పారిపోయింది. కిరణ్ అరుపులకు చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. చివరికి పులిని ఊరి బయటకు తరిమి అధికారులకు సమాచారం ఇచ్చారు. పిలగాడి శరీరంపైన పులి గాట్లు పడ్డాయి. చిరుతపులి దాడిలో కిరణ్, పిల్లలకు వీపు, చెంపలు, కళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి.