
జనగాం : బిడ్డకు జ్వరమొస్తేనే తల్లులు తల్లడిల్లిపోతారు. కానీ ఓ మహాతల్లి మాత్రం అనారోగ్యంతో ఉన్న పసిపాప ప్రాణం తీసింది. పసికందును హత్య చేసి చైన్ స్నాచింగ్ డ్రామా ఆడింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
జనగాం జిల్లా అంబేద్కర్ కాలనీకి చెందిన ప్రసన్న, భాస్కర్ దంపతులకు ఏడాది వయసున్న పాప ఉంది. పసికందులో వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడంతో జీవితాంతం బాలికతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించిన ఆమె బిడ్డను వదిలించుకునే మాస్టర్ ప్లాన్ చేసింది. కన్న బిడ్డ ప్రాణం తీసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు చైన్ స్నాచింగ్ డ్రామా ఆడింది. బైక్పై వచ్చిన దొంగలు తన మెడలోని మంగళసూత్రాన్ని తెంపే ప్రయత్నం చేయగా అడ్డుకున్నట్లు చెప్పింది. దీంతో స్నాచర్లు తన చేతుల్లో ఉన్న పాప మెడలోని చైన్ లాక్కొని చిన్నారిని సంపులో పడేసినట్లు కట్టుకథ చెప్పింది.
పాప తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి ప్రసన్న చెబుతున్న కథనంపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. ఎదుగుదల లేని బిడ్డతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తానే చిన్నారిని చంపినట్లు అంగీకరించింది. నిందితురాలు ప్రసన్న పై 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.