గాంధీ ఆస్పత్రిలో అర్ధరాత్రి హైడ్రామా

గాంధీ ఆస్పత్రిలో అర్ధరాత్రి హైడ్రామా
  • ఓయూ జేఏసీ నేత వద్దకు ఎమ్మెల్సీ వెంకట్​ 
  • ఆస్పత్రి వద్ద స్టూడెంట్స్​ నినాదాలతో ఉద్రిక్తత

పద్మారావునగర్, వెలుగు:  గాంధీ ఆస్పత్రిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.  ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులుగా ఆస్పత్రిలోనే విద్యార్థి నేత మోతీలాల్​నాయక్​ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్సీ, ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, మరికొందరు కాంగ్రెస్​ ఆస్పత్రికి వచ్చారు. అక్కడే ఉన్న ఓయూ విద్యార్థులు వీ వాంట్​ జస్టిస్​..100 శాతం జాబ్​ క్యాలెండర్​ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్సీ వెంకట్​ ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వెళ్లి.. ఆయనను మెయిన్​ బిల్డింగ్​3 వ ఫ్లోర్​లోని ఐఎంసీ వార్డులో ఉన్న మోతీలాల్​నాయక్​ వద్దకు పంపారు. అర్ధరాత్రి దాటే వరకు నాయక్​తో ఎమ్మెల్సీ చర్చలు జరిపారు. నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని మోతీలాల్ నాయక్ చెప్పడంతో వెంకట్ వెనుతిరిగారు. మెయిన్ గేటు వద్ద ఓయూ స్టూడెంట్స్ భారీగా ఉండడంతో  శాంతిభద్రతల దృష్ట్యా ఆస్పత్రి వెనుక గేటు నుంచి బయటకు పంపించారు. చిలకలగూడ ఎస్ఐ బాలరాజ్​ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.