బషీర్బాగ్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలన్నారు. లేదంటే మరో దళిత ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. అనంతరం ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పులిజాల గెలువన్నను నియమించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్ కుమార్, టీఎండీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్, మార్వాడీ గో బ్యాక్ కోఆర్డినేటర్ డాక్టర్ బొమ్మెర స్టాలిన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు డాక్టర్ మీసాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
